ఎంఎస్‌పీ భారాన్ని రాష్ట్రాలపై మోపొద్దు

– ‘మద్దతు’ ప్రకటించిన పంటలన్నింటినీ కేంద్రమే కొనాలి
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల డిమాండ్
– ఖరీఫ్‌కు అందుబాటులో ఉంచాల్సిన విత్తనాలపై సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పీ ప్రకటించి పంటలను కొనే బాధ్యతను మాత్రం రాష్ట్రాలపై వేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల విమర్శించారు. దీంతో రాష్ట్రంపై అధిక భారం పడుతోందని తెలిపారు. ఎంఎస్‌పీ ప్రకటించిన ప్రతీ పంటను కేంద్రమే కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. సచివాలయంలో వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కమిషన్ సభ్యులతో శుక్రవారం సమావేశమైన మంత్రి తుమ్మల వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం అందుబాటులో ఉంచాల్సిన వరి రకాల ఎంపిక, విత్తన లభ్యత, సాగు ప్రణాళికలపై వ్యవసాయ శాఖ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం బీపీటీ-5024, ఆర్ఎన్‌ఆర్ -15048, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరాం, కేఎ న్‌  ఎం-1638, డబ్ల్యూజీఎల్-44, డబ్ల్యూజీఎల్ 962, జేజీఎల్ 1798, మరికొన్ని సన్న రకాలను సిద్ధం చేసినట్లు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది 33 రకాల సన్న రకాలను అందుబాటులో ఉంచడం వల్ల రైతులు అమ్మకాల సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు, కొన్నింటికి బోనస్ కూడా రాకుండా ఇబ్బందులుపడ్డారని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ సంవత్సరం అలాంటి సమస్యలు రాకుండా పరిమిత రకాలు, రైతులకు అధిక దిగుబడి ఇచ్చే రకాలు అందుబాటులో ఉంచడంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. సివిల్ సప్లై అధికారులతో సమన్వయం చేసుకుని రాష్ట్రం, కేంద్రం కొనుగోలు చేసే పరిమాణాల ఆధారంగా విత్తనాల సరఫరా ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుండి 9 వరకు జరిగే రైతు ఉత్సవాల కార్యక్రమంలో మే 4న ఈ విత్తనాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మే 15 కల్లా ఎంపిక చేసిన విత్తన రకాలను రైతులకు సిద్ధంగా ఉంచాలని అధికారులకు చెప్పారు. అధిక దిగుబడి, మార్కెట్లో డిమాండ్ ఉన్న విత్తనాలనే అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. సీడ్ కార్పొరేషన్ ద్వారా ఈ విత్తనాలను సరఫరా చేయడంతోపాటు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఇదే రకాల విత్తనాలను అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం విత్తన కంపెనీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని వ్యవసాయ శాఖ కార్య‌ద‌ర్శికి సూచించారు. వచ్చే మంగళవారం జరిగే రైతు నేస్తం కార్యక్రమంలో కూడా ఇదే విషయంపై చర్చించాలని సూచించారు. ఈ రకాలతో రైతులకు మేలు జరగాలని, ప్రభుత్వం ఏయే పంటలను కొనాలనుకుంటుందో రైతులు ముందుగానే తెలుసుకునేలా వివరాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఎంఎస్‌పీ శాస్త్రీయంగా లేదని, కేంద్ర ప్రభుత్వ విధానాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కోదŠండరెడ్డి అన్నారు. ఎంఎస్‌పీ విషయంలో రైతు సంఘాల, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను కేంద్రం పట్టించుకోలేదన్నారు. మంత్రి మాట్లాడుతూ కేంద్రం కేవలం ఎంఎస్‌పీ ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. ధర ప్రకటించి ఏమీ పట్టనట్టు ఉంటోందని, రైతులకు ఆ ధర అందుతుందో, లేదో చూడట్లేదని అన్నారు. బహిరంగ మార్కెట్‌లో కూడా ఎంఎస్‌పీ అందేవిధంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, దీంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. తెలంగాణ వంటి రాష్ట్రాలలో రైతులు మద్ధతు ధర రాకుండా నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో రైతుల వద్ద నుండి మద్ధతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని, దీంతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతోందని అన్నారు. ఏటా ప్రభుత్వంపై రూ.2000 నుండి రూ.3000 కోట్లు అదనంగా భారం పడుతున్నదని, అయినప్పటికీ కేంద్రం నుండి ఎలాంటి సహాకారాలు అందడం లేదని అన్నారు.  సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *