అసమానతలను సృష్టిస్తున్న ‘నీట్’

– హిందీ మనకు అసవరం లేదు
– కుటుంబ పార్టీలకు వ్యతిరేకం
– ప్రజల సంపూర్ణ మద్దతుతో అధికారం చేపట్టాం
– కరూర్ తొక్కిసలాట ఘటన మరచిపోలేని విషాదం
– అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక ప్రసంగం

చెన్నై, జూన్ 23 : తమిళనాడు విద్యార్థుల్లో ‘నీట్‌’ అసమానతల్ని సృష్టిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అన్నారు. అసమానతలకు కారణమైన ‘నీట్‌’ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా హిందీ వివాదం, ‘నీట్‌’, కరూర్ తొక్కిసలాట ఘటన వంటి పలు అంశాలను ప్రస్తావించిన విజయ్ విమర్శకులకు గట్టిగా బదులిచ్చారు. తమిళం, ఇంగ్లీష్‌లతో కూడిన ద్విభాషా విధానానికే తాము కట్టుబడి ఉంటామన్నారు. ‘నీట్‌’ వల్ల సామాజిక అసమానతలు పెరుగుతున్నాయని అన్నారు. విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడి తెస్తున్న ఈ పరీక్షను రద్దు చేసి ఇంటర్ మార్కుల ఆధారంగా వైద్య సీట్లను కేటాయించాలని తమిళనాడు చాలాకాలంగా కోరుతోందని ఆయన గుర్తు చేశారు. హిందీ భాషపైనా స్పందిస్తూ తమిళం రాష్ట్ర భాషగా, ఇంగ్లీష్ అంతర్జాతీయ భాషగా సరిపోతాయని తన వైఖరిని స్పష్టం చేశారు. మÖడో భాషను బలవంతంగా రుద్దాల్సిన అవసరంలేదని, రెండు భాషల విధానమే కొనసాగుతుందని తేల్చి చెప్పారు. తమ పార్టీని విమర్శించే వారికి ఈ సందర్భంగా గట్టిగా సమాధానమిచ్చారు. ప్రజల మద్దతుతోనే తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధికారంలోకి వచ్చిందన్న ఆయన దీని వెనుక ఎన్నో కుట్రలు, సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు. ‘జనం గుండెల్లో స్థానం సంపాదించడం అంత సులువు కాదు.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే ఇక్కడకు వచ్చాం.. అయినప్పటికీ కొందరు ‘నటుడి పార్టీ’ అనే విమర్శలు గుప్పిస్తున్నారు. వాటిని పట్టించుకోం. మా రాజకీయాలు పారదర్శకంగా ఉంటాయని విజయ్ చెప్పారు. అలాగే వారసత్వ రాజకీయాల గురించి స్పందిస్తూ డీఎంకేపై విజయ్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘మా రాజకీయాలు ఒక్క కుటుంబం కోసం కాదు.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం మాదే.. అదే పాలన.. అదే మా లక్ష్యం’ అని స్పష్టం చేశారు. సాధారణంగా చాలామంది రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తారు.. కానీ తాను ప్రజల్లోకి వెళ్లిన తర్వాత పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశా.. తనపై నమ్మకం ఉంచి ప్రజలు గెలిపించారని విజయ్ అన్నారు.  ఎన్నికల ప్రచార సమయంలో చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనను కూడా విజయ్ ప్రస్తావించారు. 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ విషాద ఘటన తనను ఎంత వేదనకు గురిచేసిందో మాటల్లో చెప్పలేను.. ఆ బాధ తనను ఎన్నటికీ వదలదు.. ఆ ఘటన విషయంలోనూ తమపైనే నిందలేశారు. ఇది అత్యంత దారుణం.. రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *