– ఉప్పల్ నుంచి ప్రతి అరగంటకో బస్సు నడపాలి
-పేదలు, వృద్ధులు రవాణా పరంగా ఇబ్బందులు పడకూడదు
– వివిధ జిల్లా కేంద్రాల నుంచి కూడా బస్సు సదుపాయం కల్పించాలి
– రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ ఎంపీ వినోద్ మార్ లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10: రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సులభంగా అందుబాటులోకి రావాలంటే యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఏఐఐఎంఎస్ బీబీనగర్‌కు ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పించాలని మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆర్టీసీ అధికారులను కోరారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వై.నాగి రెడ్డికి ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏఐఐఎంఎస్ కు నేరుగా బస్సు సర్వీసులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ ఉప్పల్ జంక్షన్ నుంచి ఎయిమ్స్‌కు ప్రయాణికుల అవసరాలు, నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకొని ముఖ్యంగా హాస్పిటల్ రద్దీ సమయాల్లో ప్రతి 30 నిమిషాలకు ఒక ప్రత్యేక బస్సు సర్వీసును నడపాలని కోరారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రికి ఈ అంశంపై విజ్ఞప్తి చేసి ఏఐఐఎంఎస్ ఏర్పాటుకు చొరవ తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. అప్పటి టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కూడా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకువచ్చి ఈ డిమాండ్ సాధనకు కృషి చేశారన్నారు. ఈ నిరంతర ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రానికి ఏఐఐఎంఎస్ మంజూరైందని, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం బీబీనగర్‌లో సుమారు 200 ఎకరాల భూమిని కేటాయించిందని వివరించారు. ఈ ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ ద్వారా అందుతున్న ప్రయోజనాలు సమీప ప్రాంతాల ప్రజలకే పరిమితం కాకుండా ఇతర అన్ని జిల్లాల ప్రజలకు, ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.వృద్ధులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన రోగులు, తదుపరి వైద్య సంప్రదింపుల కోసం హాస్పిటల్ కు వచ్చే వారు రవాణా ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ఒకటి కంటే ఎక్కువ బస్సులు మారుతూ హాస్పిటల్ కి చేరుకోవాల్సిన పరిస్థితి రోగులకు ఇబ్బందికరంగా మారుతుందని పేర్కొన్నారు. ఏఐఐఎంఎస్ ఔట్ పేషెంట్ విభాగం (ఓపీ) సమయాలకు అనుగుణంగా బస్సు వేళలను సమన్వయం చేయాలి. తెల్లవారుజామునే హాస్పిటల్ కు చేరుకునేలా బస్సు సర్వీసులు, అలాగే మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో తిరుగు ప్రయాణానికి అనువైన సర్వీసులు ఏర్పాటు చేయాలి. పొరుగు జిల్లాల్లోని ముఖ్య పట్టణాలు, రవాణా కేంద్రాలకు కూడా బస్సు కనెక్టివిటీని విస్తరించాలి అని విజ్ఞప్తి చేశారు. ప్రధాన బస్ స్టేషన్లు, ఉప్పల్ జంక్షన్, ఏఐఐఎంఎస్ ప్రాంగణంలో బస్సు మార్గాలు, సమయాలు, చార్జీల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని ఆయన కోరారు. బీబీనగర్ ఏఐఐఎంఎస్ను ప్రధానమంత్రి అధికారికంగా ప్రారంభించనున్న నేపథ్యంలో, ఆ కార్యక్రమానికి ముందుగానే ప్రాథమిక రవాణా ప్రణాళికను సిద్ధం చేసి, తొలి విడత బస్సు సర్వీసులను ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రారంభించాలని రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులను విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





