– నీట్ పరీక్షా పత్రం లీక్ కేసులో సుప్రీం అసహనం
న్యూదిల్లీ, మే 25: దేశవ్యాప్తంగా దుమారం రేపిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్ని ఆదేశాలు జారీ చేసినా గత పేపర్ లీక్ ఘటనల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఎన్‌టీఏతోపాటు కేంద్రం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీకవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అంతకుముందు 2024లోనూ ఈ పరీక్ష పేపర్ లీక్ చోటుచేసుకుంది. దీంతో ఏటా ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోన్న ఎన్‌టీఏపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే వైద్య విద్య ప్రవేశ పరీక్ష నిర్వహణ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి బదులుగా ఓ స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఎన్‌టీఏ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఎన్‌టీఏ తమ వైఫల్యాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోకపోవడం విచారకరం.. ఈ అంశం గతంలోనూ సుప్రీంకోర్టును చేరింది.. అప్ప్పుడు మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశాం.. ఆ కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేయగా వాటిని ఎన్‌టీఏ అంగీకరించింది. మరి వాటి అమలు కోసం ఎలాంటి చర్యలు చేపట్టారో మేం తెలుసుకోవాలనుకుంటున్నాం.. ఆ వివరాలకు సంబంధించి గురువారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలి‘ అని ధర్మాసనం ఎన్‌టీఏను ఆదేశించింది. దీంతోపాటు ఈ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్రం, సీబీఐకి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



