– మిగతా ధాన్యం కూడా కొనడానికి ప్రభుత్వం సిద్దం
– కేంద్రం తీరుతోనే కొనుగోళ్లలో ఇబ్బందులు
– బీజేపీ తీరుపై మండిపడ్డ మంత్రి తుమ్మల
ఖమ్మం, ప్రజాతంత్ర, మే 25: అన్ని రకాల పంటలను తమ ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యాతాలకుంట టన్నెల్‌ను మంత్రి సోమవారం పరిశీలించి అక్కడే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు. బీజేపీ నేతలు సిగ్గు లేకుండా బస్సు యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో కనీసం గన్నీ బ్యాగులు తీసుకు రాలేని పరిస్దితి ఉందని, కేంద ప్రభుత్వ దుర్మార్గమైన విధానాల కారణంగానే రైతాంగం కష్టాల్లో ఉందని విమర్శించారు. కనీసం డీజిల్ ఇవ్వకపోవటంతో ఎక్కడికక్కడ ధాన్యం రవాణా ఆగిపోయిందని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. అటు సాగర్, ఇటు సీతారామ ఆయకట్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కృష్ణా గోదావరి జలాలతో సస్యశ్యామలం కాబోతోందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు అందాలనేది తన చిరకాల వాంఛ అని ఉద్ఘాటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతం ఎక్కువ అని, ఖమ్మం జిల్లాకు గోదావరి ఆయకట్టు దక్కలేదని చెప్పారు. ఎక్కువ భూభాగం ఎన్నెస్పీ కెనాల్ పైభాగం ఉందని, కింద భాగంలో గోదావరి ఉండటంతో నీరు అందలేదని అన్నారు. తాను టీడీపీలో నీటిపారుదల శాఖ మంత్రిగా అప్పటి ముఖ్యమంత్రిని ఖమ్మానికి గోదావరి జలాలు అందించాలని కోరానని గుర్తు చేశారు. నల్గొండ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతానికి మాజీ సీఎం ఎన్టీఆర్ లిప్ట్ ఇరిగేషన్‌కు అవకాశం ఇచ్చారని, గోదావరిపై మొట్టమొదట దేవాదుల ప్రారంభించామని తెలిపారు. గోదావరిపై ఎత్తిపోతల పథకాలకు తప్ప మరో అవకాశం లేదన్నారు. గోదావరిపై 1998లో దుమ్మగూడెం ప్రతిపాదన తీసుకొచ్చామని, ఆనాడు దుమ్ముగూడెం వద్ద రాజీవ్ సాగర్`ఇందిరా సాగర్ వరకు ప్రారంభించిన పంపులు మోటార్లకే పరిమితమయ్యాయని అన్నారు. దుమ్ముగూడెం శ్రీరామచంద్రుడు నడయాడిన ప్రాంతంలో సీతారామ ప్రారంభించామని తెలిపారు. ఆ ప్రభుత్వంలో కేవలం పంప్‌హౌస్ నిర్మాణ పనులకే పరిమితమయ్యారన్నారు. యాతాలకుంట టన్నెల్ ద్వారా సత్తుపల్లి ట్రంక్‌కు నీరు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో ఈ టన్నెల్ పూర్తి చేయడానికి కూడా నిర్ణయం తీసుకోలేదని మంత్రి తుమ్మల ఎద్దేవా చేశారు. ఇది తన జీవిత ఆశయమని, లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పానని, ఆయన యాతాలకుంట టన్నెల్‌కు అనుమతి ఇవ్వగా 15 నెలల్లో రెండు కిలోవిÖటర్ల పొడవు నిర్మాణం జరిగిందని చెప్పారు. రేవంత్‌రెడ్డి మొదటిసారి రాజీవ్ లింక్ కెనాల్‌కు అనుమతి ఇచ్చారని, ఆరు నెలల్లో ఈ కెనాల్ పూర్తి చేశామని అన్నారు. తనను ఆశీర్వదించిన రైతాంగాన్ని ఆదుకోవాలన్నదే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. ఆగష్టు 15లోగా లైనింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 35 సంవత్సరాల క్రితమే డొక్కా సీతమ్మ ఆక్విడెక్ట్ కట్టామని ప్రస్తావించారు. రైతుల త్యాగానికి ఫలితంగా నష్టపరిహారం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఒప్పించానని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



