హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : మహిళలపై వేధింపులు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం కూడా నేరమేనని, ఆ నిశ్శబ్దాన్ని వీడి బాసటగా నిలవడమే అసలైన పౌర బాధ్యత అని మహిళా భద్రతా విభాగం డీజీ చారు సిన్హా పేర్కొన్నారు. ఈమేరకు పురుషులను సామాజిక పోరాటంలో భాగస్వాములను చేసేందుకు స్టాండ్ విత్ హర్ అనే వినూత్న డిజిటల్ క్యాంపెయిన్ కి శ్రీకారం చుట్టినట్లు ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవలం చట్టాలు, పోలీసుల నిఘాతోనే భద్రత సాధ్యం కాదని, ప్రతీ పురుషుడి ఆలోచనలో మార్పు వచ్చినప్పుడే మహిళలకు అసలైన రక్షణ లభిస్తుందని స్పష్టం చేశారు. ఈ క్యాంపెయిన్ నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోందని, దీనికి మద్దతుగా సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సమాజంలో మహిళలపై జరిగే చిన్నపాటి అవహేళనలు మొదలుకుని దారుణమైన నేరాల వరకు చాలా సందర్భాల్లో పురుషులు మౌనంగా ఉండిపోతారని, అయితే ఆ నిశ్శబ్దం కూడా నేరానికి పరోక్షంగా మద్దతు ఇవ్వడమేనని చారు సిన్హా నొక్కి చెప్పారు. మౌనం వీడి బాధ్యతాయుతమైన పౌరులుగా గళమెత్తాలని, కేవలం ప్రేక్షకులుగా కాక మార్పునకు నాంది పలికే నాయకులుగా ఎదగాలన్నదే ఈ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. డిజిటల్ వేదికగా సాగుతున్న ఈ కార్యక్రమంలో సినీ నటుడు అడివి శేష్‌తోపాటు విరాజిత, దీపక్ కరముంగికర్, శరత్ నల్లా, చిల్లర్ బాయ్ వంటి ప్రముఖులు భాగస్వాములయ్యారని ఆమె తెలిపారు. ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఒక మహాసముద్రంతో పోల్చిన అడివి శేష్.. మహిళలపై వచ్చే అసభ్యకర వ్యాఖ్యలు, ట్రోలింగ్‌ను అంటుకునే ఇసుకగా అభివర్ణించారని, ఆ ఇసుకను తుడిచేయాల్సిన బాధ్యత ప్రతి పురుషుడిపై ఉందని సందేశమిచ్చారని డీజీ సిన్హా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఏదైనా ఫొటో లేదా వీడియోను షేర్ చేసే ముందు సదరు మహిళా మిత్రుల అనుమతి తీసుకోవడం ప్రాథమిక సంస్కారమని, అది వారి హక్కు అని గుర్తు చేశారు. వీధుల్లోనే కాక కార్యాలయాలు, కుటుంబాల్లోనూ ఆడవారి పట్ల గౌరవం పెరగాలని, వారి ఎదుగుదలను చూసి ఓర్వలేక వెక్కిరించడం లేదా బాడీ షేమింగ్ చేయడం వంటి ధోరణులు మారాలని సూచించారు. ప్రతి పురుషుడు తన రోజువారీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని తోటి పురుషులకు ఆదర్శంగా నిలిచి మహిళలకు భరోసా ఇచ్చేలా రోల్ మోడల్‌గా మారాలని ఆమె ఆకాంక్షించారు. మహిళలను గౌరవించడం మన సంప్రదాయంగా మారినప్పుడే సమాజంలో నిజమైన మార్పు వస్తుందని, ఇంట్లోని ఆడబిడ్డను ఎంతగా ఆదరిస్తామో, బయటి మహిళల పట్ల కూడా అదే గౌరవం చూపినప్పుడే సురక్షిత వాతావరణం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. ఈ గొప్ప మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలని, ఎక్కడైనా తప్పు జరుగుతున్నప్పుడు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోకుండా ధైర్యంగా ప్రశ్నించాలనిడీజీ చారుసిన్హా పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





