బండి కుమారుడిని తప్పించే యత్నం

– ‘సిట్‌’ విచారణ పేరుతో కాలయాపన
– మాజీ మంత్రి వేముల విమర్శలు

నిజామాబాద్, ప్రజాతంత్ర, మే 12 : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడనడం హాస్యాస్పదమన్నారు. ‘సిట్‌’ విచారణ పేరిట నిందితుడిని సీఎం రేవంత్ రెడ్డి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒక మైనర్ బాలికకు డ్రగ్స్ ఇచ్చి, మద్యం తాగించి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నా పోలీసులు మూడు నెలలుగా ఫిర్యాదు తీసుకోకుండా తాత్సారం చేయడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందని వేముల ఆరోపించారు. మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే గత్యంతరం లేక పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. పోక్సో కేసులో బాధితురాలికి రక్షణ కల్పించాల్సింది పోయి ఆమెపైనే హనీట్రాప్ కేసు పెట్టడం దారుణమని మండిపడ్డారు. మైనర్ హనీట్రాప్ చేస్తుందా అని ప్రశ్నించారు. దీన్నిబట్టి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఒక్కటేనని అర్థమవుతున్నదన్నారు. వీళ్లిద్దరూ కలిసి వ్యాపారాలు చేస్తున్నారని, కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అందుకే కేంద్ర మంత్రి కొడుకుపై ఇంత పెద్ద నేరం మోపినా ప్రభుత్వం మిన్నకుండిపోయిందని అన్నారు. ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా దీనిపై స్పందించకపోవడం వెనుక మర్మమేంటని ప్రశ్నించారు. పొద్దున లేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు మీద విషం చిమ్మే బండి సంజయ్ తన కొడుకు చేసిన నేరంపై ఏం సమాధానం చెబుతారని వేముల నిలదీశారు. తన కొడుకుపై వచ్చిన పోక్సో కేసుపై నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని, రాజకీయ జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, బాధితురాలికి, ఆమె కుటుంబానికి తక్షణమే పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. బాలికకు న్యాయం జరిగే వరకు తాము పోరాడుతామని స్పష్టం చేశారు.
—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *