తిరుమలాయపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, మే 12: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేకల తండా శివారులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏకలవ్య నర్సరీ సమీపంలో వరంగల్ -ఖమ్మం ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక లారీ ఆలుగడ్డ లోడుతో వస్తుండగా మరో లారీ బొగ్గు లోడుతో వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఢీకొన్న వెంటనే రెండు వాహనాలకు మంటలు అంటుక వడంతో లారీ డ్రైవర్లు ఇద్దరూ సజీవ దహనం అయ్యారు. ప్రమాద తీవ్రత కారణంగా మంటలు భారీగా ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఓ క్లీనర్ కు స్వల్ప గాయాలు కాగా, వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం కారణంగా వరంగల్ -ఖమ్మం రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బొగ్గు లోడు లారీ డ్రైవర్ జేమ్స్ (50), ఆలుగడ్డ లోడు లారీలో ఉన్న ఉత్తర ప్రదేశ్ డ్రైవర్ శ్రీ ప్రకాష్(50) సజీవ దహనమయ్యారు. బొగ్గు లోడు లారీలో డ్రైవర్ ఒక్కడే ఉన్నారు. అతని స్వస్థలం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ పల్లగిరి. ఆలుగడ్డ లోడు లారీ క్లీనర్ శ్రీకాంత్(45) లారీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న కాల్వ ఒడ్డు నాయుడుపేట వాసి బానోత్ రామారావు సంఘటన స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టారు. తన కారులో క్లీనర్ శ్రీకాంత్ ను వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద సంఘటనపై ఎస్ఐ జగదీష్ కేసు నమోదు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





