హద్దులు దాటితే ఎవరిపైనైనా చర్యలు

– సురేఖ తొలగింపుపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ 

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ నిర్ణయం బాధ కలిగించేదే అయినా పార్టీ క్రమశిక్షణే అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకుంటుందని తేల్చి చెప్పారు. దిల్లీలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె సుష్మిత పార్టీపై చేసిన తీవ్ర వ్యాఖ్యలను సురేఖ వెంటనే ఖండించకపోవడాన్ని ఏఐసీసీ చాలా తీవ్రంగా పరిగణించిందని మహేశ్ గౌడ్ తెలిపారు. ఆమె వైఖరి అభ్యంతరకరంగా ఉందని, అందుకే క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అధిష్ఠానం ఈ చర్యలు తీసుకుందని వివరించారు. పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే చర్చించడానికి పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, ప్రధాన కార్యదర్శి వంటి అనేక అంతర్గత వేదికలు ఉన్నాయని గుర్తు చేశారు. వాటిని కాదని బహిరంగంగా మీడియాతో మాట్లాడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో ఏ నాయకుడైనా మాట్లాడేటప్పుడు హద్దులు దాటితే చర్యలు తప్పవు అని ఆయన అన్నారు. అయితే సురేఖ కాంగ్రెస్‌లోనే కొనసాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆమె పార్టీలో ఉంటే భవిష్యత్తులో తప్పకుండా అవకాశాలు లభిస్తాయని సూచనప్రాయంగా చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎవరినీ రాజకీయంగా బ్లాక్‌మెయిల్ చేయాల్సిన అవసరం లేదని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *