– ఇచ్చిన హామీలు అమలు చేస్తూ పోతున్నాం
– ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కుటుంబానికి సంక్షేమం
– మీడియా సమావేశంలో మంత్రులు భట్టి, తుమ్మల
ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 24: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమ ప్రభుత్వమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ఆనాడు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరమ్మ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు నేటికీ చెక్కుచెదరలేదని గుర్తుచేశారు. వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతు ఆశీర్వాద సభ సన్నాహక సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శించారు. కసీఆర్ చేసిన అప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీతో చెల్లిస్తోందన్నారు. తండ్రి, కొడుకు, అల్లుడు, కూతురు మాయమాటలతో రాష్ట్రంలో తిరుగుతున్నారని, ప్రజలు నమ్మవద్దని కోరారు. రెండున్నరేళ్ల కాలంలో ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ వస్తున్నామని తెలిపారు. కోటి పది లక్షల కుటుంబాలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా ఇస్తున్నామన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, నిరుపేదలకు రూ.22 వేల కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని చెప్పారు. రైతు రుణ మాఫీ, రైతు భరోసా కింద వేల కోట్లు, మహిళల ఉచిత బస్సుకు రూ.13వేల కోట్లు చెల్లించామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ’సర్’ ప్రమాదకరమైందని అన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు వోటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఓటు హక్కు ఎంతో విలువైనదన్నారు. పోలింగ్ సిబ్బందికి సమగ్రమైన సమాచారం అందించాలన్నారు. ఈనెల 30న మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాధపురంలో జరిగే రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రెండున్నరేళ్ల కాలంలో రైతు భరోసాకు రూ.36 వేల కోట్లు అందించిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వరి, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు అవసరమైన ఎరువులను అందించామని చెప్పారు. 30న రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలన్నారు. రైతులను ఆదుకోవడంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని మంత్రి తుమ్మల విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాసు నాయక్, రాష్ట్ర కళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు నూత సత్యనారాయణ, ‘సుడా’ చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





