నీటి వాటా పూర్తి వినియోగానికి బహుముఖ వ్యూహం

– తుంగభద్ర బోర్డును పటిష్టం చేయాలి
– ఆర్డీఎస్ భద్రతకు చేపట్టాల్సిన పనులను గుర్తించాలి
– పూడికతీతకు కర్నాటక సహకారం కోరాలి
– తుంగభద్ర, అంతర్రాష్ట్ర జలాలపై సీఎం సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్‌డీఎస్) కింద తెలంగాణకు కేటాయించిన నీటి వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు తక్షణ, దీర్ఘకాలిక పరిష్కారాల అన్వేషణను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఆర్‌డీఎస్ కింద రాష్ట్రానికి ఏడాదికి దాదాపు 16 టీఎంసీల నీటి హక్కు ఉన్నప్పటికీ ప్రస్తుతం 5 నుంచి 6 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోగలుగుతోంది. సిల్ట్ పేరుకుపోవడం, నిర్మాణపరమైన అవరోధాలు, కాల్వలో నీటి ప్రవాహానికి ఆటంకాలు ప్రధాన సమస్యలుగా మారాయి. తుంగభద్ర నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయ సాధనకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డిల ఆధ్వ‌ర్యంలో జలసౌధలో బుధవారం సమీక్షా స‌మావేశం జ‌రిగింది. తుంగభద్ర డ్యామ్, నది ప్రవాహం నుంచి తెలంగాణకు హక్కుగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా ఇప్పుడు అయిదారు టీఎంసీలకు మించి రావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ కింద జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపు 75 గ్రామాల్లో 83,987 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉంది. మూడు రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్నందున కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక నీటి వాటాల సమర్ధ వినియోగానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సారథ్యంలో తుంగభద్ర బోర్డును పటిష్టం చేయాలని కోరారు. ఆర్డీఎస్ ఆనకట్ట ప్రమాదకరంగా మారిందని, భద్రత దృష్ట్యా చేపట్టాల్సిన పనులను అత్యవసరంగా గుర్తించాలని కోరారు. ఆర్డీఎస్ కెనాల్ ఆధునికీకరణకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.59 కోట్లు డిపాజిట్ చేసిందని, ప్యాకేజీ 1, 2 పనులు ఇప్పటికీ చేపట్టలేదని, ప్యాకేజీ 3, 4 పనులు మాత్రం పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి పీపీటీ ద్వారా వివరించారు. మొదటి రెండు ప్యాకేజీల పనులు వెంటనే చేపట్టాలని కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ముగ్గురు సీఎంలతో గురువారం కర్నాటకలో జరిగే సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించారు. ఆర్డీఎస్ వద్ద తెలంగాణ భూభాగం వైపు పూడిక నిండిపోవడంతో ఆశించిన విధంగా నీటిని మళ్లింపు సాధ్యం కావడం లేదని ఇంజనీర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 2004లో నిపుణుల కమిటీ పూడిక తొలిగించాలని సూచించిందనిచ, ఆ కమిటీ సిఫారసులు ఇప్పటకీ అమలు కాలేదనే చర్చ జరిగింది. వెంటనే పూడిక తీసేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. పూడిక పేరుకున్న భూభాగం కర్ణాటకలో ఉండటంతో ఆ రాష్ట్ర సహకారం కోరాలని నిర్ణయం తీసుకున్నారు. పూడికతీతతోపాటు 2004లో నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలను అమలు చేయాలని కేంద్రానికి వినతి పత్రం అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. అప్పటి నివేదికకు ఇప్పుడున్న వాస్తవ పరిస్థితిని విశ్లేషించుకోవాలని సూచిస్తూ వెంటనే పూర్తి వివరాలతో నివేదికను తయారు చేయాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. తుంగభద్ర ఎత్తిపోతల పథకంలో భాగంగా సాధ్యమైనంత నీటిని వినియోగించుకునే ప్రత్యామ్నాయాలు కూడా పరిశీలించాలన్నారు. తుమ్మిళ్ల నుంచి నీటిని వినియోగించుకునేందుకు కీలకమైన మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్యాన్ని పెంచాలని, వీలైనంత వేగంగా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి అదేశించారు. సమీక్షలో ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎంవో కార్యదర్శి మాణిక్ రాజ్, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *