– టుబాకో కంట్రోల్ బోర్డుకు రాష్ట్రపతి భవన్ అధికారుల ఆదేశాలు
– పొగాకు నియంత్రణ అవార్డు గ్రహీత మాచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : జన హితం కోరుతూ తాను రాసిన లేఖకు రాష్ట్రపతి సానుకూలంగా స్పందించడం పట్ల పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్సుమెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన గురువారం ఇక్కడ మాట్లాడుతూ పొగాకు నియంత్రణ గురించి తాను రాసిన లేఖకు రాష్ట్రపతి భవన్ సానుకూలంగా స్పందించిందన్నారు. విద్యా సంస్థల వద్ద పొగాకు నియంత్రణ కోసం చర్య తీసుకోవాలని టుబాకో కంట్రోల్ బోర్డును రాష్ట్రపతి భవన్ అధికారులు ఆదేశించారని వివరించారు. 22 ఏళ్లుగా పొగాకు నియంత్రణకు విశేష కృషి చేస్తున్న తన తపనకు రాష్ట్రపతి భవన్ ఆహ్వానం అందడంతో జన్మ ధన్యం అయ్యిందని రఘునందన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కోవలోనే మే, జూన్ నెలల్లో భారత రాష్ట్రపతికి లేఖ రాశానని రఘునందన్ చెప్పారు. ఈ లేఖలో విద్యార్థులు, యువత పొగాకు ఉత్పత్తులకు అలవాటు కావడానికి కారణం విద్యా సంస్థల వద్ద పొగాకు ఉత్పత్తులను విక్రయించడమే.. కావున స్కూళ్లు, కాలేజీల వద్ద సిగరెట్, బీడి, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని నిషేధించాల్సిన అవసరం ఉంది అని వేడుకుంటూ విద్యా సంస్థల వద్ద ‘నో స్మోకింగ్ జోన్’ల ఆవశ్యకతను వివరించానన్నారు. విద్యార్థులు, యువత శక్తి నిర్వీర్యం కాకూడదంటే పొగాకు నియంత్రణ ఆవశ్యమన్నారు. భావిభారత పౌరులను తీర్చిదిద్దే విద్యా సంస్థల వద్ద పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని నిషేధించండి అంటూ ఈ-మెయిల్‌తోపాటు, రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్‌సైట్‌లో విజ్ఞప్తి చేశానన్నారు. ఈ విజ్ఞప్తికి రాష్ట్రపతి భవన్ సానుకూలంగా స్పందించిందని, పొగాకు నియంత్రణ బోర్డు సైతం తనకు ఫోన్ చేసి రాష్ట్రపతి ఆదేశాలను ఆమలు చేస్తామని చెప్పినట్లు రఘునందన్ వివరించారు. విద్యార్థులుగా ఉన్నపుడే యువత చెడు అలవాట్లకు గురికాకుండా చూడాల్సిన అవసరం ఉందని, తమ పిల్లల్ని లక్షలు వెచ్చించి చదువు’కొనే’లా చేస్తున్న తల్లిదండ్రులు వారు స్కూల్, కాలేజీల వద్ద ఏ దురలవాట్లకు ‘గురి’అవుతున్నారో అంతగా పట్టించుకోకపోవడంతోపాటు అడిగినంత పాకెట్ మనీ ఇచ్చి చెడు అలవాట్లకు ఆజ్యం పోసిన వారు అవుతున్నారని రఘునందన్ అవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు రాష్ట్రపతికి 42 పేజీల నివేదికను పంపాననన్నారు. దీంతో రాష్ట్రపతి భవన్ సానుకూలంగా స్పందించి తన సూచనను ప్రాధాన్యతతో పరిశీలించి తగు చర్య తీసుకోవాల్సిందిగా ఆరోగ్య శాఖను ఆదేశించినట్టు తనకు తెలిపినట్లు రఘునందన్ వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




