టీవీ రంగ ప్రతిభకు ప్రోత్సాహంగా అవార్డులు

– ఆర్‌ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : తెలంగాణ టెలివిజన్ రంగంలో ప్రతిభను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ టెలివిజన్ అవార్డులు (టీజీఎస్‌టీఏ)ను ప్రదానం చేయనున్నట్లు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. అవార్డుల కమిటీ సభ్యులతో సెక్రటేరియట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో అవార్డుల విధివిధానాలు, లోగో, అవార్డుల పేర్లు, కేటగిరీలు, అవార్డుల ప్రదానోత్సవ వేదిక తదితర అంశాలపై మంత్రి సుదీర్ఘ చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ టెలివిజన్ రంగం సమాజంపై విశేష ప్రభావం చూపే మాధ్యమమని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు టెలివిజన్ కార్యక్రమాలను అధికంగా వీక్షిస్తున్నారని పేర్కొన్నారు. మంచి సందేశాన్ని అందించే ధారావాహికలు, కార్యక్రమాలు, బాలల చిత్రాలు, సామాజిక స్పృహ కలిగిన కంటెంట్‌ను రూపొందించే వారిని ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. టెలివిజన్ నాన్-ఫిక్షన్ కార్యక్రమాలు, దినసరి ధారావాహికలు, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీలు, సామాజిక ప్రాధాన్యత గల చిత్రాలు, విద్యా చిత్రాలతోపాటు వివిధ సాంకేతిక, సృజనాత్మక విభాగాల్లో అవార్డులను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. ఉత్తమ దర్శకుడు, నటీనటులు, రచయితలు, సంగీత దర్శకులు, ఛాయాగ్రాహకులు, యాంకర్లు, డబ్బింగ్ కళాకారులు, ఎడిటర్లు, ఆర్ట్ డైరెక్టర్లు, కాస్ట్యూమ్ డిజైనర్లు, మేకప్ ఆర్టిస్టులు తదితర విభాగాల్లో వ్యక్తిగత పురస్కారాలు కూడా అందజేయనున్నట్లు తెలిపారు. టెలివిజన్ నాన్-ఫిక్షన్ కార్యక్రమాలకు కనీసం 13 ఎపిసోడ్‌లు, దినసరి ధారావాహికలకు కనీసం వంద ఎపిసోడ్‌లు పూర్తి చేసి ఉండాలని మంత్రి తెలిపారు. బాలల చిత్రాలు, డాక్యుమెంటరీలు, సామాజిక ప్రాధాన్యత గల, విద్యా చిత్రాలు 20 నుంచి 60 నిమిషాల నిడివి కలిగి ఉండాలన్నారు. న్యూస్ చానల్స్‌లో యాంకర్స్, ప్రెజెంటర్స్(పురుషులు,మహిళలు) విభాగంలో అవార్డుల జాబితాలో చేర్చాలని సూచించారు. ఈ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిన జాబితాను అవార్డుల పరిశీలనకు స్వీకరించనున్నట్లు తెలిపారు. టీవీ రంగానికి చెందిన నిష్ణాతులైన కమిటీ చైర్మన్, సభ్యులు ఉన్నారు కాబట్టి ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలన్నారు. తెలంగాణ భాష, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం, వారసత్వాన్ని ప్రతిబింబించే టెలివిజన్ కృతులకు పి.వి.నరసింహారావు పేరును అనుసంధానించే అంశాన్ని కమిటీ ప్రతిపాదించిందని, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టిన మహనీయుడు, బహుభాషా కోవిదుడు అయిన పి.వి. నరసింహారావు పేరుకు తగిన గౌరవాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని పేర్కొన్నారు. అవార్డుల పేరు, లోగో తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా ఉండాలని, మొదటిసారిగా ప్రదానం చేయనున్న ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియ పూర్తిస్థాయిలో పారదర్శకంగా జరగాలని కమిటీకి మంత్రి సూచించారు. వీలైనంత త్వరగా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించి రెండుమూడు ప్రత్యామ్నాయ వేదికలను ప్రతిపాదించాలని ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ముకుంద రెడ్డికి సూచించారు. అనంతరం ఈ అంశాలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కమిటీ చైర్మన్ మర్రార్ శరత్, సభ్యులు డాక్టర్ ఎం.వినోద్‌బాల, పి.బిందు నాయుడు, పి.మంజుల నాయుడు, ఎం.రూపా దేవి, సయ్యద్ మీర్, పి.కిరణ్ (జెమిని కిరణ్), కె.బాపినీడు చౌదరి (ఈటీవీ), ఎం.విజయ్ భగవాన్ (మాజీ డైరెక్టర్, డీడీకే, హైదరాబాద్), కె.సీతాదేవి, డాక్టర్ అనుక్నూర్ గౌతమ్, మధు మహంకాళి, విష్వేందర్ రెడ్డి, ఎల్.త్రినాథ్ రావు, డైరెక్టర్ కిషోర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *