ఖమ్మం జిల్లాకు శాశ్వత సాగునీటి భద్రతే లక్ష్యం

– సీతమ్మసాగర్, ఇత‌ర‌ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేస్తాం
– నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. భూసేకరణ, అటవీ అనుమతులు, నిధుల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఎర్రమంజిల్ జలసౌధలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ సీతారామ ఖమ్మం భవిష్యత్తును మార్చే ప్రాజెక్టు అని, పాలేరు లింక్ కెనాల్ ద్వారా కొత్త ఆయకట్టుకు సాగునీరు, పాత ఆయకట్టుకు స్థిరీకరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మున్నేరు-పాలేరు అనుసంధానం ఖమ్మం, సూర్యాపేట రైతులకు వరం అంటూ విద్యుత్ ఖర్చు లేకుండా గురుత్వాకర్షణ పద్ధతిలో నీటి మళ్లింపు ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. భద్రాచలం, ఖమ్మం వరద రక్షణ పనులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ప్రతి ప్రాజెక్టుకు గడువులు నిర్దేశించి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామHని, ఖమ్మంను అభివృద్ధి చెందిన వ్యవసాయ జిల్లాగా తీర్చిదిద్దుతామని, ఖమ్మం రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక కార్యాచరణ : మంత్రి పొంగులేటి

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రత కల్పించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు. సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టులతోపాటు జిల్లాలోని అన్ని ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగవంతం చేసి రైతులకు త్వరితగతిన ప్రయోజనాలు అందిస్తామని చెప్పారు. భూసేకరణ, అటవీ అనుమతులు, నిధుల విడుదల వంటి సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించి ప్రాజెక్టుల పూర్తి దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా భవిష్యత్తును మార్చే కీలక ప్రాజెక్టుగా నిలుస్తుందని, పాలేరు లింక్ కెనాల్ ద్వారా కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు పాత ఆయకట్టును స్థిరీకరించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, సాగునీటి విస్తరణే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రధాన లక్ష్యాలని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. రైతుల అభ్యున్నతి కోసం అవసరమైన ప్రతి ప్రాజెక్టునూ పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

సీతమ్మసాగర్ కు అడ్డంకులు తొలగిస్తాం: భట్టి విక్రమార్క

సీతారామ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నీళ్లు రావాలంటే అత్యంత కీలకమైన ‘సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాల్సి ఉందని, దీనికి అడ్డంకిగా మారిన న్యాయపరమైన సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ బ్యారేజీ నిర్మాణానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) క్లియరెన్స్ తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని, అడ్వకేట్ జనరల్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు. ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలను పర్యవేక్షించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ బ్యారేజీ పూర్తయితేనే సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధికి, ఆయా ప్రాంతాల్లో సాగునీటి వసతి కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని భట్టి తెలిపారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న స్థానిక వనరులను గుర్తించి వాటిని త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలన్నారు. జిల్లాలో కొనసాగుతున్న ప్రాజెక్టులు, కొత్త ప్రతిపాదనలను స్పష్టమైన నివేదిక రూపంలో నీటిపారుదల శాఖ మంత్రికి సమర్పించాలని సూచించారు. ప్రాధాన్యత క్రమాన్నిబట్టి ఆ నివేదికలను ఆర్థిక శాఖకు పంపితే వాటిని పరిశీలించి వెంటనే బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఎకరాలను సాగులోకి తీసుకురాగలిగే చిన్న తరహా ప్రాజెక్టులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకమైన భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అధికారులు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ పెండింగ్ బిల్లులను క్లియర్ చేయించుకోవాలని, ప్రభుత్వం కూడా ప్రాధాన్యత క్రమంలో వీటికి నిధులు విడుదల చేస్తుందని భట్టి విక్రమార్క వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *