నీటి వాటాలపై రాజీపడే ప్రసక్తి లేదు

– వాటాల్లో బిఆర్‌ఎస్‌ ‌వల్లే తెలంగాణకు నష్టం
– అసత్యాలను ప్రచారం చేయడం అలవాటు చేసుకున్న కెటిఆర్‌
-‌ మీడియా సమావేశంలో మండిపడ్డ మంత్రి శ్రీధర్‌ ‌బాబు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్టు 12 : ‌తెలంగాణ నీటి వాటా విషయంలో ఎక్కడా రాజీపడబోమని పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌ ‌బాబు స్పష్టం చేశారు. నీటి వాటాల్లో తెలంగాణకు గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు. గాంధీ భవన్‌లో బుధ‌వారం మంత్రుల‌తో ముఖాముఖి కార్య‌క్ర‌మం అనంత‌రం మీడియా స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ జీఆర్‌ఎం‌బీ సమావేశానికి హాజరవుతామని, నీటి వాటాపై బలంగా కొట్లాడతామని తేల్చి చెప్పారు. అసత్యాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై మండిపడ్డారు. కేసీఆర్‌ ‌ఫాం హౌస్‌లో పండిన వరికి వచ్చిన ధర ఎంతో చెప్పాలంటూ ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్‌ ‌చేశారు. తాము రూ.కోటిన్నరకు ఇచ్చిన భూమిని బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రూ. 90 లక్షలకే ఇచ్చిందని గుర్తు చేశారు. నిబంధనల మేరకే భూ కేటాయింపులు జరిగాయని ఆయన వివరించారు. అయిదెక‌రాల భూమిని రూ.7.5 కోట్లకు ఇచ్చామని చెప్పారు. కేటీఆర్‌ ‌చెబుతున్న రూ.200 కోట్లు ఎక్కడివో చెప్పాలని నిలదీశారు. హిల్ట్ ‌పాలసీ వల్ల హైదరాబాద్‌ ‌ప్రజలకు మేలు జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తలను కేటీఆర్‌ భయపెట్టడం మంచిది కాదన్నారు. రాష్ట్ర‌ అభివృద్ధిని అడ్డుకోవడం సరైనది కాదని హితవు పలికారు. భూ కేటాయింపులపై కేటీఆర్‌ ‌ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. జీఆర్‌ఎం‌బీ సమావేశానికి హాజరై తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల కోసం బలంగా వాదిస్తామని శ్రీధర్‌బాబు పున‌రుద్ఘాటించారు. తమపై ఉన్న కోపాన్ని రాష్ట్ర‌ ప్రజలపై చూపవద్దని కేటీఆర్‌కు సూచించారు. బీఆర్‌ఎస్‌ ‌గోబెల్స్ ‌ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదన్నారు. అందుకే ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించారని శ్రీధర్‌ ‌బాబు చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *