– ఆ ప్రాజెక్టుల్లో ఎన్డీఎస్ఏ సూచనలు పాటించాలి
– పరిహారం, పునరావాసం చెల్లింపులు వేగవంతం చేయండి
– గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీపై కన్సల్టెన్సీని నియమించండి
– నీటిపారుదల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : గోదావరి జలాలను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎల్లంపల్లితోపాటు దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేరకు ఎత్తిపోతలు చేపట్టాలన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎంసీఆర్హెచ్ఆర్డీలో బుధవారం సమీక్ష నిర్వహించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) సూచనల మేరకే సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో నీరు నిల్వ చేయడం లేదన్నారు. మేడిగడ్డతోపాటు సుందిళ్ల బ్యారేజీలోనూ అనేక లోపాలు ఉన్నట్లు తేలిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఎన్డీఎస్ఏతో సంప్రదించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారన్నారు. దేవాదుల నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిది పంపులతో ఎత్తిపోతలు చేపట్టామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోతలకు సంబంధించి చిన్న చిన్న సమస్యలుంటే అధికారులు వాటి పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం సూచించారన్నారు. పలు ప్రాజెక్టుల కింద ఒకట్రెండు గ్రామాలు, కొద్దిపాటి వ్యవసాయ భూములకు పరిహారం చెల్లింపు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించేందుకు కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారన్నారు. నీటిపారుదల, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ముంపు గ్రామాలు, పరిహారం, పునరావాసానికి సంబంధించి వాస్తవ నివేదిక రూపొందించాలని, తక్షణ ప్రభావం పడే గ్రామాలకు వెంటనే పరిహారం చెల్లించాలని సీఎం ఆదేశించారని ఉత్తమ్ తెలిపారు. ఆ పనులను పూర్తి చేస్తే బస్వాపూర్, గౌరవెల్లి ప్రాజెక్టుల్లో నీరు నింపే అవకాశం ఉంటుందని సీఎం తెలిపారన్నారు. గట్టు, గూడెందొడ్డి ఎత్తిపోతల సామర్థ్యం పెంపునకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేయాలని, గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి కన్సల్టెంట్‌ను నియమించాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు. సమీక్షలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ.శ్రీధర్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





