– కూకట్‌పల్లిలో శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి
– ఏడాదిలో గృహ ప్రవేశాలు జరిగేలా ప్రణాళిక
– తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 8 వేల ఇళ్ల నిర్మాణం
– గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : హైదరాబాద్ మహానగరంలో ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల కలను సాకారం చేసే దిశగా ప్రజా ప్రభుత్వం మరో చరిత్రాత్మక అడుగు వేస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. క్యూర్ పరిధిలో చేపడుతున్న ప్రతిష్థాత్మక ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి గురువారం (13వ తేదీ) సాయంత్రం కూకట్‌పల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంపై అధికారులతో మంత్రి బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్‌పల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్ధాపన చేయనున్న ఐదు ఎకరాల స్థలంలో నాలుగు టవర్స్ నిర్మిస్తామని, ఒక్కో టవర్‌లో 120 చొప్పున ఫ్లాట్స్ ఉంటాయని చెప్పారు. ఒక్కో అంతస్తులో 12 ఫ్లాట్స్ ఉండేలా 480 ఫ్లాట్స్ నిర్మాణం జరుగుతుందని, ఇందుకు రూ.43.20 కోట్ల ఖర్చవుతుందని తెలిపారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ఇంతవరకు సుమారు 90 ఎకరాలను ఎంపిక చేశామన్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున పేదవాడి ఇంటికి పునాది వేయడం అంటే కేవలం ఒక భవనం నిర్మించడం కాదు.. ఒక కుటుంబానికి భద్రత, ఒక తరానికి భరోసా, పేదవాడికి గౌరవంతో కూడిన జీవితం అందించడమే అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో నగరంలోనే సొంత ఇల్లు కావాలనే పేదల ఆకాంక్షను నెరవేర్చేందుకు ఇందిరమ్మ టవర్స్‌ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్థాత్మకంగా చేపట్టిందన్నారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం హైదరాబాద్ గృహ నిర్మాణ రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదలు నగరానికి దూరంగా కాకుండా.. నగరంలోనే గౌరవంగా జీవించాలి అనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించిందన్నారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను సద్వినియోగం చేసుకుని బహుళ అంతస్తుల టవర్లను నిర్మించడం ద్వారా వేలాది పేద కుటుంబాలకు సొంతింటిని అందించనున్నామని తెలిపారు. ఇది ఒకసారి చేపట్టి ముగించే పథకం కాదని, హైదరాబాద్‌లో పేదల గృహ అవసరాలను దశలవారీగా తీర్చే నిరంతర గృహ నిర్మాణ కార్యక్రమని స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో ఈ ఏడాది లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, తొలి విడతలో ప్రయోగాత్మకంగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు ఎనిమిది వేల ఇళ్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. గత నెల 20నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించామని, ఇప్పటివరకు సుమారు 50 వేల దరఖాస్తులు అందాయని మంత్రి తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు చెప్పారు. ఇందిరమ్మ టవర్స్‌లో లబ్దిదారులకు అందించే ఇళ్లు సౌకర్యవంతంగా, ఆధునిక ప్రమాణాలతో నిర్మించనున్నామని తెలిపారు. నగరంలోని అత్యంత కీలక ప్రాంతాలను గుర్తించి అవసరాన్నిబట్టి పది అంతస్తుల వరకు టవర్లను నిర్మించనున్నట్లు వివరించారు. ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న ఈ ఇళ్లలో లబ్దిదారుడి పేరుతో అన్‌డివైడెడ్ షేర్ కింద సుమారు 20 నుంచి 25 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో లబ్దిదారుడికి లభించే భూమి వాటా విలువ రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుందన్నారు. ఇలాంటి విలువైన ప్రాంతాల్లో పేదలకు సొంతింటి అవకాశం కల్పించడం దేశంలోని ఇతర మహానగరాలకు కూడా ఆదర్శంగా నిలిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యాక అర్హతలను పూర్తిస్థాయిలో పరిశీలించి ఎలాంటి రాజకీయ జోక్యం, సిఫారసులు, అవకతవకలకు తావులేకుండా అర్హులైన పేదల నుంచి పారదర్శక పద్ధతిలో డ్రా/లక్కీడిప్ ద్వారా ఇళ్ల కేటాయింపు చేపడతామని తెలిపారు. ఇల్లు మంజూరు కాని దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు చెల్లించిన ఈఎండీ మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లిస్తామని చెప్పారు. టవర్స్ నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా, వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది బోనాల పండుగ సమయానికి ఎంపికైన లబ్దిదారులతో గృహప్రవేశాలు చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. శంకుస్థాపన నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతి దశను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పేదలకు ఇళ్ల విషయంలో హామీలు మాత్రమే మిగిలాయని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మాత్రం హామీలను కార్యరూపంలోకి తీసుకొచ్చి పేదల ఇంటి తలుపు తట్టేలా గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోందని మంత్రి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





