కాంగ్రెస్ పాలనలో చస్తేనే పనులవుతాయా?

– సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ను రూ. లక్ష కోట్ల అప్పుల్లో ముంచారు
– బిల్లుల కోసం చచ్చిపోవడానికీ సిద్ధమని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డే అన్నారు
– రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజునుంచీ అదేమాట
– రూ.5వేల గౌరవ వేతనం,  రూ.300 కమీషన్ ఇస్తామని డీలర్లకు ఇచ్చిన హామీ ఏమైంది?
– మినీ సూపర్ మార్కెట్ల ఊసేలేదు
– అసెంబ్లీ, కౌన్సిల్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం
– మాజీ మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 27:  అసలు రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే.. చచ్చిపోతేనే పనులు అవుతాయా? చచ్చిపోతేనే బిల్లులు వస్తాయా? అధికార పార్టీ ఎమ్మెల్యేనే చచ్చిపోవడానికి సిద్ధమనే దుస్థితి వచ్చింది. కానీ ఎవరూ చచ్చిపోవద్దు, అందరూ బాగుండాలి. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప.. అందరం కలిసి గట్టిగా కొట్లాడి బిల్లులు, డీలర్ల కమీషన్ సాధించుకుందామని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లో మంగళవారం నిర్వహించిన రాష్ట్రవ్యాప్త రేషన్ డీలర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీలర్ల సమస్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సంద‌ర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజును గత 25 ఏళ్లుగా చూస్తున్నా. ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి సునీతా లక్ష్మారెడ్డిని, పద్మా దేవేందర్ రెడ్డిని, ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డిని గౌరవ అధ్యక్షుడిగా పెట్టుకుని డీలర్ల సమస్యల పరిష్కారం కోసం ఎవరిని ఎలా ఒప్పించాలో తెలిసిన నేర్పరి. అయితే ఈరోజు వేదిక మీద రాజు మాట్లాడుతూ డీలర్ల సమస్యలు పరిష్కారం కాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, ప్రాణత్యాగానికైనా సిద్ధం అనడం త‌న‌ను కదిలించిందన్నారు. నిన్ననే జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే, డీలర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు అనిరుధ్ రెడ్డి కూడా మంత్రుల నియోజకవర్గాలకే నిధులు పోతున్నాయి, జడ్చర్లలో రోడ్లు పగుళ్లు పడ్డా రూ.30-40 కోట్ల బిల్లులు రావడం లేదు, ఒక కాంట్రాక్టర్ చనిపోతేనే రూ.5 కోట్ల బిల్లు పడింది, నేను చచ్చిపోతేనే మా నియోజకవర్గ బిల్లులు వస్తాయంటే ప్రాణత్యాగానికి సిద్ధం అని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెల్లారే హామీలు అమలు చేయమని డీలర్లు అడగలేదు. కొత్త ప్రభుత్వం కుదురుకోవడానికి ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు ఓపికగా ఎదురుచూశారు. కానీ మూడేళ్లు గడిచినా డీలర్ల వైపు కన్నెత్తి చూసే నాథుడే లేడన్నారు. కనీసం సివిల్ సప్లైస్ కమిషనర్ గానీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని అధ్యక్షుడు రాజు బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డి తమది ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటారు. ప్రజలను ఎప్పుడైనా కలిసేదే ప్రజా ప్రభుత్వం కదా! మరి 17,200 మంది రేషన్ డీలర్లు ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షుడికే మూడేళ్లలో అపాయింట్‌మెంట్ దొరకకపోతే ఇదెక్కడి ప్రజాపాలన అని ప్ర‌శ్నించారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజు, నందయ్య తదితరులు వస్తే సచివాలయంలో రెండు రోజులపాటు కూర్చోబెట్టి భోజనం పెట్టి నాటి మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి అధికారులను, కేసీఆర్ ను వొప్పించి కమిషన్‌ను రూ. 140 కి పెంచాం. ఆ రోజు బయట ప్రెస్ మీట్ పెట్టిన ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ.140 ఏం చాలుతాయి, కనీసం రూ.300 ఇవ్వాలి అని మాట్లాడారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఒక్కో డీలర్ వందలాది ఓట్లు వేయిస్తాడని జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు నందయ్య, జీవన్ రెడ్డి వెళ్లి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబుకు చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టించారు. నెలకు రూ.5,000 గౌరవ వేతనం, క్వింటాలుకు రూ.300 కమీషన్, రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా మార్చి అన్ని వస్తువులు అమ్ముకునే అనుమతి ఇస్తామని నమ్మబలికారు.ఆ మాటలు నమ్మి డీలర్లందరూ కాంగ్రెస్‌కు పనిచేసి, ఓట్లు వేయించి గెలిపించారు.ఇవాళ డీలర్లు కొత్త డిమాండ్లేమీ పెట్టడం లేదు.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఆ మూడు హామీలనే అమలు చేయమని అడుగుతున్నారు.చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని కేసీఆర్కొ ట్లాడి తెలంగాణ సాధించిన గజ్వేల్ గడ్డ మీద సమావేశం పెడితేనే ప్రభుత్వ పెద్దలకు సురుకు తగిలి కదలిక వస్తుందని ఇక్కడి నుంచే డీలర్లు సమరశంఖం పూరించారు.పేద ప్రజలందరికీ కడుపునిండా అన్నం పెడుతున్న రేషన్ డీలర్ల కడుపు మాత్రం కాంగ్రెస్ పాలనలో ఎండిపోతోంది.నాడు కేసీఆర్ పేదవాడు కడుపునిండా తినాలని మనిషికి 4 కిలోల బియ్యాన్ని 6 కిలోలకు పెంచి, కార్డుకు 20 కిలోల సీలింగ్ ఎత్తేశారు. ఇంట్లో 10 మంది ఉంటే 60 కిలోల బియ్యం ఇచ్చారు.ఇవాళ డీలర్లకు రూపాయి కమిషన్ పెరగలేదు గానీ, నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం ఆకాశాన్నంటాయి.మంచినూనె రూ. 210, కందిపప్పు రూ. 175, పెసరపప్పు రూ. 130, ఉల్లిగడ్డ రూ. 60 కి చేరింది, ఎల్లిగడ్డ ధర కొండెక్కింది. పన్నులు, అధికారుల వేధింపులు పెరిగిపోయి డీలర్లు కుటుంబాలను వెళ్లదీయలేని దుస్థితి నెలకొంది.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖ పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందో చెప్పడానికి దొడ్డు బియ్యం వ్యవహారమే నిదర్శనమన్నారు. సన్న బియ్యం పంపిణీ మొదలుపెట్టాక, చిన్నగా ఉండే రేషన్ షాపుల్లో జాగా లేకపోయినా మూడు నెలల బియ్యం ఒకేసారి నిల్వ చేసి ఇవ్వమంటున్నారు.మరోవైపు గత 16, 17 నెలలుగా పాత దొడ్డు బియ్యం నిల్వలను అలాగే వదిలేశారు. గోదాములు, ఎంఎల్ఎస్ పాయింట్లలో లక్ష మెట్రిక్ టన్నులు, రేషన్ షాపుల్లో 40 నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం మూలుగుతోంది. దీని విలువ అక్షరాలా రూ. 600 కోట్లు! 16 నెలలుగా ఆ బియ్యం ముక్కిపోయి, ఎర్ర పురుగులు, లక్క పురుగులు పట్టి, ఎలుకలు, పందికొక్కులు తిని పిండిగా మారిపోయింది. సిద్దిపేటలో ఒక రేషన్ షాపుకు వెళ్లి చూస్తే పురుగులు బయటకు పారుతున్నాయి.ఆ పాడైపోయిన బియ్యాన్ని మనుషులే కాదు, బయట పారబోస్తే తిన్న పశువులు, కుక్కలు కూడా విషతుల్యమై చచ్చిపోయే పరిస్థితి వచ్చింది.మిలిటరీలో పనిచేశానని గొప్పలు చెప్పుకునే మంత్రికి, 16 నెలల క్రితమే ఆ బియ్యాన్ని వేలం వేసి అమ్మే కనీస తెలివి లేదా? ఆ బియ్యాన్ని అమ్మితే వచ్చే రూ. 600 కోట్లతోనే డీలర్ల కమిషన్ పెంపు, గౌరవ వేతనం ఇచ్చేయవచ్చు కదా!తమ నిర్లక్ష్యంతో రూ. 600 కోట్ల ప్రజాధనాన్ని పందికొక్కుల పాలు చేయడమే కాకుండా.. ఇప్పుడు టెండర్లు పిలిచి 16 నెలల క్రితం షాపులో ఉన్న స్టాక్ లెక్క ప్రకారం తూకం వేసి ఇవ్వాలని డీలర్లను వేధిస్తున్నారు.అసలే ఎంఎల్ఎస్ పాయింట్లలో తూకం తక్కువ వస్తుంటే, ఏడాదిన్నరగా ఎలుకలు, పురుగులు తిని తగ్గిన 5, 6 క్వింటాళ్ల తరుగును కూడా డీలర్లే జేబులోంచి కట్టాలనడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నేడు దాదాపు రూ. లక్ష కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది.
సన్న బియ్యం నిధులు, సన్న వడ్ల బోనస్ డబ్బులు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా కార్పొరేషన్‌కు విడుదల చేయకుండా కార్పొరేషన్‌నే అప్పులు తెచ్చుకోమంటోంది.గ్రామాల్లో మహిళలకు గ్యాస్ సబ్సిడీ ఒక నెల వేస్తే మూడు నెలలు ఎగ్గొడుతున్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బలంగా ఉంటేనే డీలర్లు బతుకుతారు, కార్పొరేషన్ దివాలా తీస్తే డీలర్లు కూడా ఆగమవుతారు. డీలర్లకు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అంటే అదీ కాదు. రూ.లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ, రూ. లక్ష కోట్లతో ఫ్యూచర్ సిటీ, రూ. 30 వేల కోట్లతో రోడ్లు అంటున్నారు. అందాల పోటీలకు, ఫుట్‌బాల్ షోకులకు నిధులుంటాయి. నాడు కేసీఆర్ గారు క్యాంప్ ఆఫీస్ కడితే విమర్శించిన రేవంత్ రెడ్డి నేడు రూ.100 కోట్లతో కొత్త క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నారు. మరి రాష్ట్రంలోని 17,200 మంది డీలర్లకు నెలకు రూ. 5,000 గౌరవ వేతనం ఇస్తే అయ్యే ఖర్చు నెలకు రూ.10 కోట్లు కూడా కాదు. పేదల ఆకలి తీర్చే డీలర్లకు నెలకు రూ. 10 కోట్లు ఇవ్వడానికి మనసు రావడం లేదా? తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి డీలర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గాన్ని చర్చలకు పిలవాలి. డీలర్లపై వేధింపులు ఆపి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన రూ.5,000 గౌరవ వేతనం, రూ.300 కమీషన్, మినీ సూపర్ మార్కెట్ల హామీలను వెంటనే అమలు చేయాలి. డీలర్ల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉండి అసెంబ్లీలో, మండలిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని హామీ ఇచ్చారు. సమావేశంలో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, ధరావత్ మోహన్ నాయక్, అజీజ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *