– తుది దశలో స్ధలాల సేకరణ
– దశలవారీగా ప్రతీ పేద కుటుంబానికి సొంత ఇల్లు
– 19 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా వెయ్యి ఇళ్ల నిర్మాణం
– రెవెన్యూ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : క్యూర్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే టెండర్లు పిలవనుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మూడు కార్పొరేషన్ల పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ మరో రెండు నుంచి మూడు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. గోషామహల్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించిన పట్టాలను సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్ధానికఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులతో కలిసి మంత్రి పొంగులేటి లబ్ధిదారులకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల మాదిరిగా కాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలోని 19 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఒక్కోచోట కనీసం 500 నుంచి 1000 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం రెండో, మూడో విడతల్లో మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి 5500 వరకు ఇళ్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ పట్టణ ప్రాంతాల్లో భూమి విలువ ఎకరాకు రూ.100 నుంచి రూ.200 కోట్ల వరకు ఉన్నా కూడా ఆ భూముల విలువను పక్కనబెట్టి పేదలకు అదే ప్రాంతంలో ఇళ్లు నిర్మించి వారి పేరిట పట్టాలు ఇస్తామని మంత్రి తెలిపారు. ధూల్‌పేట ప్రాంతంలో గత ప్రభుత్వ కాలంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 125 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి అందిస్తున్నామని, మిగిలిన పేదలకు కూడా ఇళ్లు మంజూరు చేసేలా పరిసర ప్రాంతాల్లో స్థలాలను గుర్తించేందుకు కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





