వివాదాల సుడిగుండంలో భూముల వేలం!!

హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి, విధానపరమైన చర్చకు దారితీసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అత్యంత ఖరీదైన రాయదుర్గ్ పన్మక్త ప్రాంతంలో, సర్వే నంబర్ 83/1 పరిధిలోని 10.63 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ద్వారా వేలం వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ఘర్షణకు వేదికైంది. కేవలం ఈ ఒక్క భూఖండం ద్వారానే దాదాపు రూ.2,000 కోట్ల ఆదాయాన్ని రాబట్టాలని సర్కారు భావిస్తున్నది.. అయితే, ప్రజా సంపదగా ఉండాల్సిన భూములను ఈ విధంగా వాణిజ్య అవసరాలకు విక్రయించడం, అదీ న్యాయపరమైన వివాదాలు తేలకముందే వేలం వేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి.

ప్రస్తుతం వేలం వేయ తలపెట్టిన రాయదుర్గ్ భూమిపై అనేక చట్టపరమైన, చారిత్రక పరమైన చిక్కులు ఉన్నాయి. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా, జీఓ  ఎం.ఎస్.నంబర్ 4 ప్రకారం ఈ ప్రాంతాన్ని హెరిటేజ్ వార‌స‌త్వసంప‌ద‌గా గుర్తించినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీనికి తోడు, దుర్గం చెరువు స‌మీపంలో ఉన్న  భూమిపై వక్ఫ్ బోర్డుకు, అలాగే గతంలో ఇదే సర్వే నంబర్లో జరిగిన వేలానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఎస్బీఐ) ప్రభుత్వానికి మధ్య న్యాయస్థానాల్లో వివాదాలు నడుస్తున్నాయి. సుప్రీంకోర్టు సైతం వివాదాస్పద భూములపై ‘థర్డ్ పార్టీ హక్కులు’ (మూడో పక్షానికి ప్రయోజనాలు) సృష్టించరాదని స్పష్టం చేసిన తరుణంలో, ప్రభుత్వం ఇంత వేగంగా వేలానికి సిద్ధపడటం పరిపాలనాపరమైన తొందరపాటు. . ! ఈ అంశంపై బీఆర ఎస్ నేత హ‌రీష్‌రావు ఈనెల 13న ప్ర‌భుత్వానికి రాసిన లేఖ‌లో, రాయ‌దుర్గ్ ప‌న్‌మ‌క్త గ్రామంలో ఉన్న  ఈ భూములను కాపాడాల‌ని  2020లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు  కోర్టుకు వెళ్లిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ఎలా వేలం వేస్తారని ప్ర‌శ్నించారు. యాజమాన్య హక్కులు తేలేవరకు ఈ వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేసారు.

ఈ భూముల వేలం వ్యవహారంలో రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడింది. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూముల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నేతలు, నేడు అధికార పీఠం ఎక్కగానే అదే బాట పట్టడం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనం. 2020లో ఇదే రాయదుర్గ్ భూముల పరిరక్షణ కోసం కోర్టు మెట్లెక్కిన నేతలే, నేడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అదే భూములను వేలం వేయడానికి ఎలా అనుమతిస్తారన్న ప్రతిపక్షాల విమర్శల్లో ప్రజాస్వామిక హేతుబద్ధత ఉంది. అధికారం మారినప్పుడల్లా విధానాలు మారడం, పాలకుల మాటలు మారడం వ్యవస్థల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని సడలిస్తుంది.సామాన్యుడిపై రియల్ ఎస్టేట్ ప్రభావం ప్రభుత్వాలు ఆదాయ వనరుల సమీకరణ పేరిట వేలం పాటలు నిర్వహించి ఎకరానికి వందల కోట్లు ధర పలికేలా చేయడం వల్ల, నగరంలో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభుత్వమే స్వయంగా భూముల ధరలను కృత్రిమంగా పెంచినట్లవుతున్నది .

దీనివల్ల హైదరాబాద్ నగరంలో ఒక సొంత ఇల్లు లేదా నివాస స్థలం కొనుగోలు చేయడం సగటు మధ్యతరగతి, పేద వర్గాలకు అసాధ్యంగా మారుతున్నది . భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు, హాస్పిటల్స్ , లేదా పేదల గృహ నిర్మాణ పథకాల (డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వంటివి) కోసం  ప్రభుత్వ భూములు అవసరమైనప్పుడు, రూపాయి ఖర్చు లేకుండా నిర్మించాల్సిన చోట, భూమి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.

ప్రభుత్వాలు సంక్షేమ పథకాల అమలుకు, మౌలిక వసతుల కల్పనకు నిధులు సమకూర్చుకోవడాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ, అందుకోసం భవిష్యత్ తరాల ఆస్తి అయిన ప్రభుత్వ భూములను, వారసత్వ సంపదను పణంగా పెట్టడం సరైన మార్గం కాదు. తాత్కాలిక అవసరాల కోసం శాశ్వత సంపదను అమ్ముకోవడం ఆర్థిక క్రమశిక్షణ అనిపించుకోదు. రాయదుర్గ్ భూముల వేలంపై లేస్తున్న అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలించాలి. చట్టపరమైన, వక్ఫ్, హెరిటేజ్ వివాదాలను పూర్తిగా పరిష్కరించిన తర్వాతే, పారదర్శకంగా ముందడుగు వేయాలి. పాలకుల ఆలోచనలు కేవలం “రియల్ ఎస్టేట్ వ్యాపారి” లాగా కాకుండా, రాష్ట్రాభివృద్ధిని, ప్రజా శ్రేయస్సును కాపాడే “ట్రస్టీ” లాగా ఉండాలె . ప్రజా సంపద రక్షణలోనే పాలకుల నిజాయితీ దాగి ఉందనే సత్యాన్ని ప్రభుత్వం గ్రహించాలి.

దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో భూమి అనేది అత్యంత విలువైన వనరు. కేవలం సంక్షేమ పథకాలకు నిధులు కొరవడ్డాయనో, లేదా బడ్జెట్ లోటును పూడ్చుకోవాలనో కారణాలు చూపిస్తూ ప్రభుత్వాలు విలువైన భూములను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడం భావ్యం కాదు. ఇది ఒక రకమైన ‘తాత్కాలిక ఉపశమనం’ మాత్రమే తప్ప దీర్ఘకాలిక ఆర్థిక పరిష్కారం కాబోదు. పైగా, న్యాయపరమైన చిక్కులు ఉన్న భూములను వేలం వేసి కొనుగోలుదారులను, పెట్టుబడిదారులను అయోమయంలోకి నెట్టడం రాష్ట్ర పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. ఒకవైపు పరిపాలనా వికేంద్రీకరణ, మరోవైపు మౌలిక వసతుల పెంపు అంటూ గొప్పలు చెబుతున్న పాలకులు, నగర ఊపిరితిత్తులుగా నిలిచే ఇలాంటి ఖాలీ  స్థలాలను పార్కులుగానో, ప్రజా అవసరాల కోసమో కేటాయించాల్సింది పోయి, కేవలం ఆదాయ వనరుగా మాత్రమే చూడటం విచారకరం. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టుదలకు పోకుండా, రాజకీయ విమర్శలను కేవలం ఆరోపణలుగా కొట్టిపారేయకుండా, సమగ్రమైన విచారణ జరిపి ప్రజా హిత నిర్ణయం తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *