– మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: రాష్ట్రంలో భానుడు ప్రచండ భానుడిగా మారాడు. రోహిణి కార్తె రాకముందే నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండల ధాటికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. మేలో మరింత తీవ్రంగా ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అక్కడక్కడా జల్లులు కురుస్తున్నా రాష్ట్రంలో పలుచోట్ల చండప్రచండంగా ఎండలు మండుతున్నాయి. దీంతో ఉదయం 9గంటలు దాటిన తర్వాత బయటకు రావాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన ఎండలు, వడగాలుల ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో జనసంచారం లేక రహదారులన్నీ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నది. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత ప్రమాదస్థాయికి చేరినట్టు హెచ్చరించింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మెండోరాలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా 12 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది. 2016 ఏప్రిల్ 26న మంచిర్యాల జిల్లా దండేపల్లిలో నమోదైన 48.8 డిగ్రీల తర్వాత ఈ నెలలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని పేర్కొన్నది. దీంతో ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది. వచ్చే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని వివరించింది. ప్రజలకు బయటకు వెళ్లే సమయాల్లో తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఉష్ణోగ్రతలు గరిష్ఠ Í్థయికి చేరుకోవడంతో దిల్లీ సహా 21 రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ పలు కీలక సూచనలు చేసింది. వృద్ధులు, గర్భిణులు, పిల్లలతోపాటు ఉపాధి హామీ కూలీలపై ఈ ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరించింది. అలాంటి వారి రక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించింది. 2019 నుంచి 2023 మధ్య కాలంలో వడదెబ్బ వల్ల 3,712 మంది మరణించినట్టు గుర్తుచేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే హీట్ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసి బలహీనవర్గాలకు మంచినీరు, ఆశ్రయం, వైద్య సహాయం అందించాలని సూచించింది.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




