మాటల తడి మనమధ్య
ఆరిపోయినప్పుడు
తాను పలకరింపుల
తుంపరలనైనా చిలకనప్పుడు
నేనూ ఆత్మాభిమానం అడ్డొచ్చి
పెదాలు బిగించి
మౌనాన్ని ఆశ్రయిస్తాను
చెప్పేందుకు మేమిద్దరం
జత జీవన సహచరులమే
అయినప్పటికీ….
తాను తానుగానే ఉండి పోతాడు
నేను నాకునేనుగా మిగిలిపోతాను
లోకం కోసం లేని నవ్వుల్ని
మొహాలపై కృత్రిమంగా అతికించుకుని
బ్రతికే విచిత్ర కాపురం మాది
అయినా….ఒకే ఇంటిలో
మొగుడి ఫ్రేమ్ లో తాను
పెళ్ళాం ఫ్రేమ్ లో నేనూ
కదలక గోడకు వేరు వేరుగా
వేళ్ళాడుతూ ఇలా మిగిలే ఉన్నాం !
( ఆస్ట్రేలియన్ కవయిత్రి లాంగ్ లీవ్
‘యూ అండ్ మి’ కవిత ప్రేరణ )
– డా. కె. దివాకరా చారి
9391018972





