– స్వలాభం కోసమే ప్రాణహిత పేరు, డిజైన్ మార్పు
– ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి పంటలకు నీరందిస్తాం
– సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటన
– కాళేశ్వర ముక్తేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
– ఆలయ దర్శనం తర్వాత మేడగడ్డ బ్యారేజీ పరిశీలన
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : కాళేశ్వరం ప్రాజెక్టు దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. గోదావరి జలాలతో ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలని 1975లో జలగం వెంగళరావు ఆనాటి మహారాష్ట్ర సీఎంతో ఒప్పందం చేసుకున్నారని, తర్వాత వైఎస్ హయాంలో 2009లో రూ.38,063 కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మొదలుపెట్టారని ఆయన గుర్తు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.11,700 కోట్లు ఖర్చు చేయగా దీంతో ఆర్ధిక, రాజకీయ ప్రయోజనం లేదని కేసీఆర్ భావించి రీడిజైనింగ్ పేరుతో పేరు, ఊరు మార్చి అంచనాలను రూ.లక్షా 50 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. 2016లో మొదలుపెట్టిన మేడిగడ్డను 2019లో పూర్తిచేశామని ప్రారంభించారని, ఇది అద్భుతమని భ్రమలు కల్పించి 2018 ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందారని విమర్శించారు. 2023లో మేడిగడ్డ కుప్పకూలగా అన్నిటినీ దాచిపెట్టి 2023 ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనుకున్నా ప్రకృతి బయటపెట్టిందని అన్నారు. ప్రాజెక్టులో సమస్యలు రాగానే 2023 నవంబర్ 1 న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్ఏ) ప్రాథమిక నివేదికను కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఇచ్చిందని తెలిపారు. ఆ నివేదికను ఆయన పట్టించుకోలేదని, ఈ దోపిడీపై పీసీ ఘోష్ కమిటీ సంపూర్ణ నివేదిక ఇచ్చిందని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్రానికి తమ ప్రభుత్వం తీర్మానం చేసి పంపిందని సీఎం రేవంత్ వివరించారు. కేసీఆర్, హరీష్‌లను జైల్లో వేయాలని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్ రెడ్డి ఆనాడు అన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. కాళేశ్వరంతో ఇప్పటి వరకు లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేకపోయారన్నారు. నెల రోజుల ముందే అధికారులతో, సాంకేతిక నిపుణులతో ఇవాళ సమావేశం పెట్టుకున్నామన్నారు. అయితే నిజాలు బయటపడతాయని తెలిసి ఇవాళ కావాలని బీఆరఎస్ వాళ్లు పొలిటికల్ మీటింగ్ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అయినా తాము అనుమతులు ఇచ్చామని తెలిపారు. కాళేశ్వరంపై విచారణకు ఆదేశిస్తారని తెలిసి బీజేపీ నేతల కాళ్లు పట్టుకునేందుకు హరీష్‌రావు దిల్లీకి పరుగెత్తాడని మీడియా బయటపెట్టినా వాళ్లు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదని అన్నారు. బీజేపీని అడ్డు పెట్టుకుని అవినీతి కేసుల నుంచి బయటపడతామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, అవసరమైన ప్రణాళికలతో ముందుకు వెళతామని హెచ్చరించారు. హరీశ్ తెలివి ఉంది మాట్లాడుతున్నాడో, తెలివి లేక మాట్లాడుతున్నాడో తెలియదు.. శ్రీపాద ఎల్లంపల్లి ఈ ప్రాజెక్టుకు ప్రాణవాయువు.. హరీష్ నిక్కరు తొడగకముందే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంది.. ఎల్లంపల్లి నీటితోనే రాష్ట్రంలో అత్యధిక పంట పండించారు అని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం విచారణపై సీబీఐ ఎందుకు మౌనంగా ఉంది.. తాము పదేపదే లేఖలు రాసినా ఎందుకు స్పందిచడం లేదు అని ప్రశ్నించారు. హరీష్ రహస్య పర్యటన వెనక మతలబు ఏంటో, దిల్లీలో ఎవరెవరిని కలిశారో హరీష్ బయటపెట్టాలన్నారు. తీర్పు ప్రకటించకముందు వాదించడానికి వీలుండదు.. మరి న్యాయవాదులను కలవడానికి వెళ్లాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టును అలా వదిలేయం.. మరమ్మతులు చేసి నీరు అందిస్తాం అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా, రూ.203 కోట్లతో ఆరెంద- దామెరకుంట గ్రామాల మధ్య మానేరు నదిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శంకుస్థాపన చేశారు.
కాళేశ్వరం ఆలయ పునరభివృద్ధి, బస్టాండుకు శంకుస్థాపన : ఆలయంలో మహా రుద్రాభిషేకం 

శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర దేవాలయం అభివృద్ధికి సంబంధించి రూ.3.70 కోట్ల వ్యయం కాగల పనులకు, రూ.198 కోట్ల వ్యయంతో చేపట్టనున్న కాళేశ్వరం బస్ స్టేషన్ పనులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. తొలుత శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని సీఎం, మంత్రులు దర్శించుకోగా ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. స్వామివారికి మహా రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం శుభానంద దేవి ఆలయంలో పూజలు చేయగా ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర మంత్రులను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావులు శేష వస్త్రాలు, స్వామి వారి తీర్థప్రసాదాలతో ఘనంగా సన్మానించారు. భక్తుల సౌకర్యార్థం కాళేశ్వరం క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆలయ పునరభివృద్ధి, నూతన బస్టాండ్ నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఆలయ పునరభివృద్ధి పనుల వివరాలను ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు వివరించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ తిదితరులు పాల్గొన్నారు. ఆలయ దర్శనం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు. వివాదాస్పదంగా మారిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, ప్రస్తుత స్థితిగతులు, పునరుద్ధరణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బ్యారేజ్ మరమ్మతులు ఎంతవరకు వచ్చాయి.. వర్షాకాలం లోపు చేపట్టాల్సిన రక్షణ చర్యల గురించి ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన నేపథ్యంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డను సందర్శించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాజెక్టు భద్రత, భవిష్యత్తు కార్యాచరణపై ఈ పర్యటన ద్వారా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
సీఎం పర్యటన సాగిందిఇలా..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటన ఆలస్యంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం మూడు గంటలకు కాళేశ్వరం దేవాలయానికి చేరుకోవాల్సి ఉండగా సాయంత్రం నాలుగు గంటల వరకు చేరుకున్నారు. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని, ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి మంత్రులతో కలిసి శంకుస్థాపన చేపట్టారు. అనంతరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని సాంకేతిక నిపుణులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు మరమ్మతుల కోసం చేపట్టాల్సిన చర్యలపై వారితో చర్చించారు. 5.30 గంటలకు ప్రారంభం కావలసిన మీడియా సమావేశం గంట ఆలస్యంగా ప్రారంభమైంది. మీడియా సమావేశానంతరం ఎనిమిది గంటలకు కాటారం మండలంలోని నస్తురుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా బహిరంగ సభలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సభకు జిల్లా నలుమూలల నుంచి భారీగా వాహనాలు తరలిరావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక జామ్ ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





