– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
– తుమ్మలతో బీహార్ వ్యవసాయ మంత్రి విజయ్‌కుమార్ భేñటీ
– ఆయిల్‌పామ్‌పై బీహార్.. మకానాపై తెలంగాణ ఆసక్తి
– సాంకేతికత, ఉత్పాదకత, పంటల వైవిధ్యీకరణపై మంత్రుల చర్చ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారి కోసం రెండున్నరేళ్లలో రూ.1.30 లక్షల కోట్లు ఖర్చు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా మంత్రి తుమ్మలను సచివాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, ఉత్తమ విధానాల అధ్యయనం, పంటల వైవిధ్యీకరణ తదితర అంశాలపై ఇరువురూ విస్తృతంగా చర్చించారు. వాతావరణ హెచ్చరికలను రైతులకు చేరవేయడం, రైతు నేస్తం ద్వారా రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం, క్రాప్ బుకింగ్, శాటిలైట్ ఆధారిత పంటల పర్యవేక్షణ, యూరియా బుకింగ్ అప్లికేషన్, అగ్రిస్టాక్ ద్వారా రైతు గుర్తింపు వంటి డిజిటల్ కార్యక్రమాల గురించి వివరించారు. కృత్రిమ మేధ ఆధారిత ‘కృషివాస’ పంటల పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా పంటల్లో సమస్యలను ముందుగానే గుర్తించి అవసరమైన ప్రాంతాల్లో సత్వర చర్యలు చేపట్టడం ద్వారా రైతుల పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడం, దిగుబడిని పెంచడం, లాభదాయకతను మెరుగుపర్చే విధానాలను మంత్రి తుమ్మల వివరించారు. రైతుబంధు, రైతు బీమా, సన్న వడ్లకు బోనస్ తదితర కార్యక్రమాల అమలు తీరు గురించి బీహార్ మంత్రికి తెలిపారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సుమారు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేశామని, సంవత్సరానికి రైతుభరోసా పథకం కింద ఎకరానికి రూ.12,000 ఇస్తున్నామని చెప్పారు. సన్నాలకు రూ.500 బోనస్ అందిస్తున్నామని, దేశంలోనే అత్యధిక వరి పండించిన రాష్ట్రం తెలంగాణే అని తెలిపారు. పంటల వైవిధ్యీకరణకు ఇస్తున్న ప్రాధాన్యతను కూడా మంత్రి తుమ్మల వివరించారు. తెలంగాణలో వరి, పత్తితోపాటు మొక్కజొన్న, కందులు, సోయాబీన్, మామిడి, ఎర్ర మిరప, పసుపు, ఆయిల్‌పామ్ తదితర పంటల సాగును విస్తరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణ దేశంలో ముందంజలో ఉందని, 2025-26లో 3.11 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు ఉండగా, 74 వేల మెట్రిక్ టన్నుల క్రూడ్ పామ్ ఆయిల్ ఉత్పత్తితో 20.01 శాతం ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియో సాధించినట్లు చెప్పారు. ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, నర్సరీలు, ప్రాసెసింగ్ మిల్లులు, మైక్రో ఇరిగేషన్ వంటి మౌలిక సదుపాయాలపై కూడా బీహార్ మంత్రి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బీహార్‌లో 91 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు
బీహార్‌లో అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలు, పంటల వైవిధ్యీకరణ, పంటల క్లస్టర్ల విధానం, సాంకేతిక వినియోగం తదితర అంశాలను బీహార్ మంత్రి విజయ్ కుమార్ సిన్హా తెలంగాణ ప్రతినిధులకు వివరించారు. బీహార్‌లో చిన్న, సన్నకారు రైతులు 91 శాతం ఉండగా, వ్యవసాయంపై ఆధారపడే జనాభా 77 శాతంగా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల వైవిధ్యానికి అనుగుణంగా ప్రత్యేక పంటల క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మకానా, మొక్కజొన్న, పండ్లు-కూరగాయలు, తృణధాన్యాల కోసం ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేసి ఉత్పత్తి, విలువ జోడింపు, మార్కెటింగ్ రంగాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు బీహార్ ప్రతినిధులు వివరించారు. దర్భంగా, మధుబని, సీతామర్హి ప్రాంతాల్లో మకానా క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. బీహార్‌లో మకానా పంటపై ప్రత్యేకంగా చేపడుతున్న కార్యక్రమాల పట్ల మంత్రి తుమ్మల ఆసక్తి కనబరిచారు. ఇటీవల మకానా ఉత్పత్తి, పరిశోధన, విలువ జోడింపు, మార్కెటింగ్, అంతర్జాతీయ అవకాశాలను పెంపొందించేందుకు మకానా బోర్డును ఏర్పాటు చేసినట్లు బీహార్ ప్రతినిధులు వివరించారు. గత పదేళ్లలో మకానా సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత 2.5 రెట్లకు పైగా పెరిగినట్లు వివరించారు.
ఆయిల్‌పామ్‌పై బీహార్, మకానాపై తెలంగాణ ఆసక్తి
బీహార్‌లో ఆయిల్‌పామ్ సాగు అవకాశాలపై ఆ రాష్ట్ర మంత్రి ఆసక్తి వ్యక్తం చేయగా బీహార్‌లో ప్రత్యేకంగా సాగవుతున్న మకానా పంట, దాని ఉత్పత్తి, విలువ జోడింపు, మార్కెటింగ్ విధానాలపై మంత్రి తుమ్మల ఆసక్తి చూపారు. రెండు రాష్ట్రాల్లో రైతులకు ప్రయోజనం చేకూరే పంటల పరస్పర అధ్యయనం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడికి దోహదం చేసుకోవాలని మంత్రి తుమ్మల కోరారు. ఇందుకోసం ఆయిల్‌పామ్ సాగు విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీహార్ నుంచి వ్యవసాయ శాఖ అధికారులు, ప్రతినిధుల బృందంతోపాటు రైతుల బృందాన్ని తెలంగాణకు ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణలో ఆయిల్‌పామ్ తోటలు, నర్సరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, సాగులో అనుసరిస్తున్న ఆధునిక విధానాలను వారు ప్రత్యక్షంగా పరిశీలించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అదేవిధంగా మకానా సాగు, ప్రాసెసింగ్, విలువ జోడింపు, మార్కెటింగ్ విధానాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ నుంచి ప్రతినిధుల బృందాన్ని బీహార్‌కు పంపిస్తామని తెలిపారు. బీహార్‌లో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన నాటు సామగ్రి, సాగు విధానాలు, మైక్రో ఇరిగేషన్, ప్రాసెసింగ్ తదితర అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం తనవంతు సహాయసహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో రెండు రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, పంటల వైవిధ్యీకరణ విధానాలను పరస్పరం పంచుకోవడం ద్వారా రైతుల ఆదాయం పెంపు, ఉత్పాదకత మెరుగుదల, విలువ జోడింపు, మార్కెట్ అవకాశాల విస్తరణకు మరింత ప్రయోజనం కలుగుతుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ-బీహార్ మధ్య వ్యవసాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, హాకా ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కో ఆపరేటీవ్ కమిషనర్ రాహుల్‌రాజ్, హార్టీకల్చర్ యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి, బీహార్ వ్యవసాయ శాఖ సెక్రటరీ నర్మదేశ్వర్ లాల్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ముకేష్ కుమార్‌లాల్, హార్టీకల్చర్ డైరెక్టర్ అభిషేక్ కుమార్ పాల్గొన్నారు.
అర్బన్ ఫార్మింగ్, మిద్దె పంటలతో ఆరోగ్యకరమైన జీవనానికి బాట
అర్బన్ ఫార్మింగ్, మిద్దె పంటలు, కిచెన్ గార్డెనింగ్‌ను నగర ప్రజల్లో విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన అర్బన్ ఫార్మింగ్ అండ్ కిచెన్ గార్డెనింగ్ ఎక్స్‌పో-2026లో ఆయన మాట్లాడారు. నగర ప్రజలకు తాజా ఆహారం, ఆరోగ్యకరమైన జీవనం, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణపై అవగాహన కల్పించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇంటి బాల్కనీ, టెర్రస్, ఇంటి ప్రాంగణం వంటి చిన్న ప్రదేశాల్లోనే కుండీలు, గ్రో బ్యాగులు, ఇతర కంటైనర్లలో కొత్తిమీర, పుదీనా, పాలకూర వంటి ఆకుకూరలు, కూరగాయలు, మూలికలను సులభంగా పెంచుకోవచ్చని మంత్రి తెలిపారు. నగరాల్లోని లక్షలాది కుటుంబాలు తమ ఇళ్లలో కొంతమేరకు ఆహారాన్ని స్వయంగా పండించుకోవడం ప్రారంభిస్తే దాని సమష్టి ప్రభావం ఎంతో గొప్పగా ఉంటుందన్నారు. వ్యవసాయం వ్యవసాయ క్షేత్రాలకే పరిమితం కాకుండా టెర్రస్‌లు, బాల్కనీలు, కమ్యూనిటీ స్థలాలు, పాఠశాలలు, కార్యాలయాలు, ఇతర సంస్థల ప్రాంగణాల్లోనూ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఇతర మొక్కలను పెంచేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయాన్ని వాతావరణ మార్పులకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. తాజాగా పండిద్దాం-ఆరోగ్యంగా తిందాం-పచ్చగా జీవిద్దాం అనే సందేశం కేవలం నినాదంగా కాక ప్రతి కుటుంబ జీవన విధానంగా మారాలని మంత్రి ఆకాంక్షించారు. ఎక్స్‌పోకు వచ్చిన ప్రజలు ఎగ్జిబిటర్లు, నిపుణులతో చర్చించి అర్బన్ ఫార్మింగ్‌లోని కొత్త సాంకేతికతలను తెలుసుకుని తమ ఇళ్లు, సంస్థలు, కమ్యూనిటీలలో గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతు నేస్తం చైర్మన్ వై.వెంకటేశ్వరరావు, ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




