– ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలి
– శాఖ నియామకాలు, పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలి
– గనులు, భూగర్భ వనరుల శాఖపై సీఎస్ సమీక్ష
హైదరాబాద్, సెప్టెంబర్ 21 : గనులు, భూగర్భ వనరుల శాఖ పరిధిలోని ఖనిజ వనరుల సమర్థవంతమైన వినియోగం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గనులు, భూగర్భ వనరుల శాఖపై ఉన్నతాధికారులతో సచివాలయంలో ఆయన సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖ పనితీరు, పరిపాలనా అంశాలు, ఆదాయ సమీకరణ, సిబ్బంది నియామకాలు, పదోన్నతులు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియలను నిబంధనల మేరకు వేగవంతం చేయాలని సూచించారు. సిబ్బంది కొరత కారణంగా శాఖ కార్యకలాపాలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇసుక అక్రమమ రవాణా, అక్రమ తవ్వకాలు, అనధికారికంగా ఖనిజాల తరలింపును అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. అక్రమ కార్యకలాపాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, విజిలెన్స్ బృందాలతో ఆకస్మిక తనిఖీలు, దాడులు చేపట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సంజయ్ జాజు సూచించారు. సమన్వయంతో, సమర్థవంతంగా పనిచేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలన్నారు. సమావేశంలో మైన్స్ అండ్ జియాలజీ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ జనరల్ (విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్) డి.ఎస్.చౌహాన్, ఐటీఈ అండ్ సీ సంయుక్త కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





