– మాజీ మంత్రి తలసాని
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20: కమీషన్‌ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం 22 ఏ తీసుకొచ్చిందని బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇండ్లు, ప్రయివేట్ భూములను 22 ఏ లో చేర్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 22 ఏను అడ్డం పెట్టుకొని భూముల యజమానులను భయపెట్టి 30 నుండి శాతం కమీషన్లను వసూలు చేసిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం తప్పిదాలు చేసి అధికారులపై నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నదని విమర్శించారు. కరోనా సమయంలో సరిపడా ఆక్సిజన్, బెడ్ లు లేక ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ అవసరాల కోసం ముందు చూపుతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం సనత్ నగర్, అల్వాల్, కొత్తపేట ప్రాంతాలలో కార్పొరేట్ స్థాయి హాస్పిటల్స్ నిర్మాణ పనులు చేపట్టిందని వివరించారు. తమ ప్రభుత్వ హయాంలోనే 60 శాతం పనులు పూర్తయ్యాయనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. సనత్ నగర్ టిమ్స్‌ను కట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకోవడం అవివేకమని విమర్శించారు. హాస్పిటల్ లో అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించకుండా హడావుడిగా ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. హాస్పిటల్ ప్రారంభోత్సవ సభలో అధికారిక కార్యక్రమం అనే సోయి లేకుండా వైద్యులు, నర్సింగ్ విద్యార్థుల ముందు ముఖ్యమంత్రి నోటికొచ్చినట్లు అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన భాషను మార్చుకోవాలని, నోటిని అదుపులో పెట్టుకోవాలని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ప్రజాపాలన అని ఒక వైపు ప్రచారం చేసుకుంటూ మరో వైపు నిర్బందాలు, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు