– రష్యాతో ఒప్పందం కుదుర్చుకోనున్న ఇండియా
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1 : ఆపరేషన్ సిందూర్‌లో సమర్థవంతంగా పనిచేసిన రష్యన్ ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలను భారత్ మరోసారి కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటి అవసరాలు పెంచుకోవాలని రక్షణ శాఖ నిర్ణయించినట్లు సమాచారం. భారత వైమానిక దళం కోసం మరో ఐదు ఎస్`400 వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు జారీ చేసిన టెండర్‌కు రష్యా స్పందించినట్లు సమాచారం. ఈమేరకు ఐదు కొత్త వ్యవస్థలను భారత్‌కు విక్రయించేందుకు రష్యా అంగీకరించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత సైనిక వ్యవస్థలో ’సుదర్శన్’గా పిలుస్తున్న ఎస్-400.. గతేడాది ఆపరేషన్ సిందూర్‌లో విజయవంతంగా పనిచేసింది. శత్రువుల వైపు నుంచి వచ్చిన ప్రమాదాలను అడ్డుకోవడంలో ఈ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసిందని భారత రక్షణ వర్గాలు తెలిపాయి. వీటి పనితీరుకు సంబంధించి పశ్చిమ వైమానిక కమాండ్ అధిపతి ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా గతంలో ఓ పోడ్కాస్ట్లో కీలక విషయాలు వెల్లడించారు. పాక్ వైమానిక దళానికి చెందిన నిఘా విమానాన్ని 314 కి.మీ దూరంలో ఎస్-400 కూల్చివేసినట్లు పేర్కొన్నారు. ఇంత దూరంలో భూమి నుంచి ప్రయోగించిన గగనతల రక్షణ క్షిపణి లక్ష్యాన్ని ఛేదించడం అత్యంత అరుదని నాడు రక్షణ రంగంలో చర్చ కూడా జరిగింది. ఎస్-400 అనేది ఒకే మిసైల్ కాదు.. ఇందులో అత్యాధునిక రాడార్లు, కమాండ్ వ్యవస్థలు, వివిధ రకాల క్షిపణులు వంటి అనేక భాగాలుంటాయి. వీటిలోని కొన్ని క్షిపణులకు 400 కి.మీ వరకు లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంటుంది. దీంతో శత్రు విమానాలు భారత గగనతలానికి చేరకముందే వాటిని గుర్తించి ఎదుర్కోగలవు. ఈ కారణంగానే భారత్ తన బహుళస్థాయి వైమానిక రక్షణ వ్యవస్థలో ఎస్-400కు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 2018లో కుదిరిన తొలి ఒప్పందం ప్రకారం భారత్ మొత్తం ఐదు ఎస్-400 యూనిట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఇప్పటివరకు నాలుగు యూనిట్లు అందాయి. ఇంకో యూనిట్ నవంబర్ నాటికి అందే అవకాశముంది. తాజాగా మరో ఐదు యూనిట్ల కోసం భారత్ ఆసక్తి చూపుతోందని సమాచారం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు
`





