– అనవసరంగా బంగారాన్ని కొనకండి
– డెస్టినేషన్ పేరుతో విదేశాల్లో పెళ్లిళ్లకు దూరం కండి
– దేశప్రజల సమష్టి కృషితోనే జీడీపీ వృద్ది రేటు
– ఇన్‌స్టా వేదికగా ప్రజలకు ప్రధాని మోదీ అభినందనలు
న్యూదిల్లీ, సెప్టెంబర్ 1 : భారత్ సాధించిన వృద్ధి రేటు దేశ సమష్టి శక్తికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నిరాశావాదులు మాత్రం తమ అసత్యాలను వ్యాప్తి చేస్తూనే ఉన్నారని విమర్శించారు. యుద్ధాలు, సరఫరా వ్యవస్థల్లో అడ్డంకుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ మెరుగైన వృద్ధి రేటు సాధించిందని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్`జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ ఏకంగా 7.8 శాతం మేర వృద్ధి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. 7.8 శాతం వృద్ధి రేటు నమోదవడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోందన్నారు. దేశ ప్రజల పట్టుదల, శక్తిసామర్థ్యాలు గొప్పవని అన్నారు. దేశ ప్రగతిని ఇలాగే కొనసాగించాల్సిన అవనరం ఉందని కూడా ప్రధాని చెప్పారు. ఆత్మనిర్భరత సాధించడం అవసరమని మరోసారి చెప్పారు. స్వదేశీ వస్తువులకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని, అనవసర విదేశీ పర్యటనలు, బంగారం కొనుగోళ్లు వద్దని సూచించారు.. విదేశీ మారకనిల్వల పొదుపు కోసం భారత్‌లోనే వివాహాది శుభకార్యాలు జరుపుకోవాలని సూచించారు. ప్రస్తుతం కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా వీడియో విడుదల చేశారు. ‘దేశ ప్రజలకు అభినందనలు.. 7.8 శాతం వృద్ధి గొప్ప విషయం.. ప్రజల సంకల్ప బలం, కృషికి ఇది నిదర్శనం.. ప్రపంచం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో భారత్ ఈ అసాధారణ ఘనతను దక్కించుకుంది.. ప్రపంచం యుద్ధంలో మునిగిపోయింది.. ఎటుచూసినా యుద్ధ వార్తలే.. సంక్షోభాలే.. సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది.. 2020లో కొవిడ్ తర్వాత నుంచి నేటి వరకు ఎక్కడా స్థిరత్వం కనిపించడం లేదు.. అయినా భారత్ పురోగమిస్తోంద’ని ఆ వీడియోలో పేర్కొన్నారు. మనం స్వావలంబనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటే స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యేనాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతామనే విశ్వాసం నాకు ఉంది’ అని మోదీ పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





