– నెహ్రూ రికార్డును తిరగరాసిన మోదీ
న్యూదిల్లీ, జూన్ 10: నరేంద్ర మోదీ భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టి బుధవారంతో 12 ఏళ్లు పూర్తయ్యాయి. అలాగే అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన అరుదైన రికార్డును కూడా ఆయన సొంతం చేసుకోనున్నారు. ఇప్పటివరకు ఈ రికార్డు నెహ్రూ పేరు మీద ఉంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక 1952 మే 13న ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1964 మే 27న మరణించేదాకా 4,398 రోజులపాటు నిరంతరాయంగా ఆ పదవిలో కొనసాగారు. కాంగ్రెసేతర పార్టీ తరఫున రెండు సార్లు పూర్తికాలపు ప్రధానిగా పదేళ్లు పనిచేసి రికార్డు సాధించిన మోదీ.. ఎన్నికైన ప్రధానిగా నెహ్రూ రికార్డును అధిగమించనున్నారు. ఈ రకంగా ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డును నేటితో మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూను అధిగమించి ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. మోదీ 2014 మే 26న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి పదవిలో వరుసగా మూడోసారి కొనసాగుతున్నారు. బుధవారంతో ఆయన ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. ఎన్నికైన ప్రధానమంత్రిగా నెహ్రూ 1952 మే 13 నుంచి 1964 మే 27 వరకు వరుసగా 4,398 రోజులు పని చేశారు. ఎన్నికైన తర్వాత వరుసగా అత్యధిక కాలం భారత ప్రధానిగా కొనసాగిన వారి జాబితాలో ఇందిరాగాంధీ మూడో స్థానంలో ఉన్నారు. ఆమె 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు వరుసగా 4,077 రోజులు పదవిలో ఉన్నారు.
మోదీకి రాష్ట్రపతి ముర్ము అభినందనలు 
ప్రధానమంత్రిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీకి అభినందనలు తెలిపారు. మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అచంచలమైన నమ్మకానికి ఈ మైలురాయి నిదర్శనమని కొనియాడారు. ఆయన పాలనలో దేశం అన్నిరంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన విస్తృతమైన సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు స్థాయి ప్రజలకు కూడా సమానంగా అందించేలా చేశాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పీఎం-జన్ మన్, ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ లకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని ముర్ము వెల్లడించారు. మోదీ స్ఫూర్తిదాయక ప్రస్థానం భావితరాల్లో దేశపు బలమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలపై ఆశను.. నూతన విశ్వాసాన్ని నింపుతుందని కొనియాడారు. ఆత్మనిర్భర్, వికసిత్ భారత్ దార్శనికతతో ప్రధాని దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
మోదీకి వివిధ దేశాల నేతల అభినందనలు 
ప్రధానమంత్రిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ దేశాధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్య బలపడుతోన్న సంబంధాలను ప్రస్తావిస్తూ ఆమె ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన మోదీకి నా అభినందనలు. ఇటీవల రోమ్‌లో మళ్లీ మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. ఇరుదేశాల ప్రజల కోసం కొత్త అవకాశాలను సృష్టించే దిశగా ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సంయుక్తంగా ప్రారంభించడం కూడా మంచి విషయం’ అని మెలోనీ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కలిసి ఉన్న ఫొటోను ఆమె పంచుకున్నారు. ’భారత్‌లో అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన ప్రధాని మోదీకి అభినందనలు. ఈ ఘనత ఆయన దశాబ్దాల ప్రజాసేవకు, నాయకత్వానికి ఒక శక్తిమంతమైన నిదర్శనం’ అని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. చారిత్రక మైలురాయికి చేరుకున్న ప్రధాని మోదీకి అభినందనలు. దేశ అభివృద్ధి, శ్రేయస్సు, ప్రపంచ వేదికపై దాని స్థానాన్ని పెంపొందించడంలో ఆయన ఎంతో కృషి చేశారు. భారత్‌తో ఉన్న సన్నిహిత, సుదీర్ఘ స్నేహాన్ని మలేషియా గౌరవిస్తోంది. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు మన ప్రజలకు అవకాశాలను విస్తరించడంలో సహకారాన్ని కొనసాగించేందుకు నేను ఎదురుచూస్తున్నా. మోదీ ఇలాంటి మరెన్నో ఘనతలు సాధించాలని.. భారత ప్రజలు శాంతి, శ్రేయస్సులతో ఉండాలని ఆకాంక్షిస్తున్నా అంటూ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం అభినందనలు తెలిపారు.
ఎన్డీయే భేటీలో మోదీకి అభినందనలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎన్డీయే నేతల పెద్దఎత్తున అభినందలు తెలిపారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకోవడం, సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన రికార్డును మోదీ సొంత చేసుకున్న నేపథ్యంలో ఎన్డీయే నేతల సమావేశం బుధవారంనాడిక్కడ భారత్ మండపంలో జరిగింది. ప్రధాన మంత్రి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో 22 ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షాల నేతలు, బీజేపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





