రూ.99,446 కోట్ల ఈఎల్‌ఐతో 3.5 కోట్ల ఉద్యోగాల లక్ష్యం

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: ఎంప్లాయ్‌మెంట్ లింక్‌డ్ ఇన్సెంటివ్ స్కీం(ఈఎల్‌ఐ) ద్వారా రూ.99,446 కోట్ల వ్యయంతో రెండేళ్లలో 3.5 కోట్లకుపైగా ఉద్యోగాలను కల్పించాలన్న లక్ష్యం పెట్టుకున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీ కళాభవన్‌లో శుక్రవారం జరిగిన ప్రధాన మంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన(పీఎం-వీబీఆర్‌వై) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆ పథకం విజయవంతం అవుతున్నదని తెలిపారు. భారత దేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు 140 కోట్ల మంది సంయుక్తంగా సాగిస్తున్న ఈ అభివృద్ధి ప్రయాణం అత్యంత కీలకమైన దశలో ఉందని తెలిపారు. యువశక్తి పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవాలంటే ప్రతి యువకుడికి నాణ్యమైన విద్య, అవసరమైన నైపుణ్య శిక్షణ, మంచి ఆరోగ్యం, సరైన ఉపాధి అవకాశాలు, విశ్వాసం కలిగించే నాయకత్వం, నీతివంతమైన, అంకితభావంతో కూడిన పాలన ఉండాలన్నారు. ఏప్రిల్ 2020 నుంచి 2025 మధ్యకాలంలో 18- 28 వయస్సు కలిగిన 3.45 కోట్లకుపైగా యువత కొత్తగా దేశపు ఫార్మల్ వర్కఫోర్స్‌లో దేశాభివృద్ధి కోసం భాగస్వాములయ్యారన్నారని, యేటా సుమారు 80 లక్షల మంది యువత దేశాభివృద్ధి యజ్ఞంలో శ్రామిక శక్తిగా అడుగుపెడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో రోజ్‌గార్ మేళాల ద్వారా 12 లక్షలకుపైగా యువతకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం అపాయింట్‌మెంట్ లెటర్స్‌ను స్వయంగా ప్రధానమంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశామని వివరించారు. ప్రభుత్వ రంగంలోనేకాక ప్రైవేటు రంగంలోనూ ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 3.43 కోట్లకుపైగా ఉద్యోగాలు కల్పించే అవకాశాలున్నాయని నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ పేర్కొందన్నారు. మొదటిసారి ఫార్మల్ వర్క్ ఫోర్స్‌లోకి ప్రవేశించే యువతకు ఒకసారి రూ.15,000 వరకు ప్రోత్సాహం అందిస్తామని, అదనపు ఉపాధి సృష్టించే యజమానులకు రెండేళ్లపాటు, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌కు నాలుగేళ్లపాటు ప్రోత్సాహకాలు ఇస్తామని కిషన్ రెడ్డి వివరించారు. తెలంగాణలో 25,000కు పైగా సంస్థలు పథకంలో నమోదు చేసుకోగా 18,000కు పైగా సంస్థలు ఇప్పటికే అదనపు ఉద్యోగాలను కల్పించి ప్రయోజనాలు పొందుతున్నాయన్నారు. ఈ పథకం యువత ఆశయాలకు, పారిశ్రామిక విస్తరణ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి ఉద్యోగులు-యజమానుల మధ్య సానుకూల భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి ప్రతి కొత్త ఉద్యోగం, కొత్త నైపుణ్యం కీలకమైన అడుగుగా మారుతుందని కిషన్ రెడ్డి చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *