ఆదిలాబాద్‌ను సురక్షిత జిల్లాగా తీర్చిదిద్దాలి

– గ్రామాల్లోనూ సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌ను విస్తరించాలి
– జిల్లా పర్యటనలో డీజీపీ ఆనంద్

ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10: హైదరాబాద్, సైబరాబాద్ నగరాల మాదిరి ఆదిలాబాద్‌ను కూడా సురక్షిత జిల్లాగా తీర్చిదిద్దాలని డీజీపీ సి.వి.ఆనంద్ సూచించారు. జిల్లా కేంద్రాలతోపాటు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌ను విస్తరించాల న్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం పర్యటించి ప్రజా భద్రత, రోడ్డు భద్రత అవగాహన, మాదకద్రవ్యాల నియంత్రణ, సాంకేతిక ఆధారిత పోలీసింగ్, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లా పోలీస్ అతిథి గృహంలో నిర్వహించిన హరితహారంలో మొక్కలు నాటారు. తర్వాత చిల్డ్రన్ పార్కును, ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్‌ను ప్రారంభించారు. గంజా, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల బారినపడిన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్న అడిక్షన్ సెంటర్‌ను సందర్శించారు. సేఫ్ ఆదిలాబాద్ లక్ష్యంగా సమీకృత సీసీ టీవీలు, ఆదిలాబాద్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సమీకృత సీసీటీవీ మానిటరింగ్ వ్యవస్థను డీజీపీ ప్రారంభించి సీసీటీవీల ఏర్పాటును అభినందించారు. నాందేడ్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలతోపాటు మహారాష్ట్ర సరిహద్దుకు అనుసంధానంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమని అధికారులు వివరించారు. ఈ ప్రాంతాల మధ్య వాహనాలు, ప్రజల రాకపోకలు అధికంగా ఉండటంతో ట్రాఫిక్ పర్యవేక్షణ, ప్రమాదాల నివారణ, నేరాల నియంత్రణ, ప్రజా భద్రత బలోపేతంలో సీసీటీవీ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ఇటీవల 300 కొత్త సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుతో ఆదిలాబాద్ పట్టణంలో మొత్తం కెమెరాల సంఖ్య 600కు చేరిందని తెలిపారు. గ్రామాల్లో 1,200కు పైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష

జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు అధికారులు, సిబ్బందితో డీజీపీ సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణ, పెట్రోలింగ్ వ్యవస్థ, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై సమీక్షించారు. నేర నియంత్రణలో ముందస్తు చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, యువతకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు యాంటీ నార్కోటిక్స్ అండ్ సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ పోలీసు అధికారి ప్రజలకు అందుబాటులో ఉండాలని, రోజూ నిర్దిష్ట సమయాన్ని ప్రజల సమస్యల పరిష్కారానికి కేటాయించాలని ఆదేశించారు. పోలీసు-ప్రజల సంబంధాలను మరింత బలోపేతం చేయాలన్నారు.

ప్రతి గ్రామంలో రోడ్డు భద్రత కమిటీలు

రోడ్డు భద్రత అనేది అందరి బాధ్యత అని పేర్కొన్న డీజీపీ.. ప్రతీ గ్రామంలో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని అర్హులైన వ్యక్తుల” పోలీసు, రవాణా శాఖల సహకారంతో లైసెన్సులు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన రంగవల్లి పోటీలు, వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేశారు.

సైబర్ నేరాలు, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలు కొత్త సవాళ్లు

రాష్ట్రం వామపక్ష తీవ్రవాద సమస్యను విజయవంతంగా ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, రోడ్డు ప్రమాదాలు కొత్త సవాళ్లుగా మారాయని డీజీపీ పేర్కొన్నారు. గత ఏడాది రాష్ట్రంలో 7,800 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారంటూ, హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా అనేక మరణాలను నివారించవచ్చని తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాద మరణాలు గణనీయంగా తగ్గాయంటూ గత ఏడాది జనవరి నుంచి మే వరకు 72 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా ఈ ఏడాది జనవరి – మే చివరి నాటికి 48కు తగ్గినట్లు డీజీపికి ఎస్పీ వివరించారు. అవగాహన కార్యక్రమాలు, పోలీసు, రవాణా శాఖలు, జిల్లా యంత్రాంగం సమిష్టి కృషి వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు. 24 మంది ప్రాణాలు కాపాడటం అంటే 24 కుటుంబాలను విషాదం నుంచి రక్షించినట్టేనని తెలిపారు.

డ్రగ్స్ తో యువత భవిష్యత్తు నాశనం 

మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు వ్యవసాయం, పరిశ్రమలు, దేశ  ఆర్థికాభివృద్ధిలో నంబర్ 1 స్థానంలో ఉన్న పంజాబ్ రాష్ట్రం డ్రగ్స్ ప్రభావంతో 21 స్థానానికి పడిపోయిందని తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. తెలంగాణ యువత అలాంటి పరిస్థితులు రాకుండా విద్య, ఉపాధి, ఆవిష్కరణలు, దేశ నిర్మాణం వైపు దృష్టి సారించాలని సూచించారు.
రోడ్డు భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాల్లో ప్రజలు చురుకుగా పాల్గొనాలని డీజీపీ పిలుపునిచ్చారు. జాతీయ రహదారుల వెంట భారీ వాహనాల అక్రమ పార్కింగ్‌ను అరికట్టేందుకు గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, యాంటీ నార్కోటిక్స్ చర్యలను పభుత్వం మరింత బలోపేతం చేస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, యువత కలిసి పనిచేసినప్పుడే డ్రగ్స్ రహిత, సురక్షిత, అభివృద్ధి చెందిన సమాజాన్ని నిర్మించగలమని డీజీపీ పేర్కొన్నారు. కార్యక్రమాల్లో డీజీ సీఐడీ అండ్ ఏసీబీ చారు సిన్హా, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిý్య, మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది, తోష సర్పంచ్ పద్మ, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

తోష గ్రామంలో ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’

గుడిహత్నూర్ మండలం తోష గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో డీజీపీ పాల్గొన్నారు. గ్రామ సభలో గ్రామ పెద్దలు, సర్పంచ్, వార్డు సభ్యులు, యువతతో మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *