సుస్థిర మైనింగ్‌లో సింగరేణి మరో మైలురాయి

– పర్యావరణ ప్రమాణాల పాటిస్తున్నందుకు కేంద్రం ప్రశంస
– వడ్డీతో రూ.40 కోట్ల డిపాజిట్ తిరిగి చెల్లించిన కేంద్ర సంస్థ
– డోర్లీ-2 గని మూసివేతలో ఆదర్శంగా నిలిచిన సింగరేణి

సింగరేణి భవన్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 10: బొగ్గు గనుల నిర్వహణలో మాత్రమే కాకుండా, గనుల మూసివేత అనంతరం పర్యావరణ పరిరక్షణలోనూ అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్న సంస్థగా సింగరేణి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ-2 ఓపెన్ కాస్ట్ గనిని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా మూసివేసినందుకు గుర్తింపుగా, గని ప్రారంభ సమయంలో డిపాజిట్ చేసిన సుమారు రూ.40 కోట్ల సొమ్మును వడ్డీతో సహా కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్  సింగరేణికి తిరిగి చెల్లించింది. గనుల ప్రారంభం నుంచి మూసివేత వరకు అమలు చేయాల్సిన మైన్ క్లోజర్ ప్లాన్, పర్యావరణ పరిరక్షణ చర్యలు, భూసంరక్షణ, పునరుద్ధరణ కార్యక్రమాలు తదితర అంశాలను సింగరేణి సంస్థ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా కచ్చితంగా అమలు చేసింది. డోర్లీ-2 గని మూసివేత ప్రక్రియలో సింగరేణి చూపిన బాధ్యతాయుత వైఖరి, పర్యావరణ హిత చర్యలు, పారదర్శకత మరియు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసిన తీరుకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. గనుల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇస్తూ సుస్థిర మైనింగ్ విధానాలను అమలు చేస్తున్న సింగరేణి సంస్థకు ఇది మరో విశిష్ట గుర్తింపుగా భావిస్తున్నారు.

ఏమిటి ఈ  ఎస్క్రో డిపాజిట్?  ఎప్పుడు తిరిగి చెల్లిస్తారు ? 

కొత్తగా ఏదైనా గనిని ప్రారంభిస్తున్నప్పుడు ఆ గని  జీవితకాలంలో అమలు జరపాల్సిన పర్యావరణహిత చర్యలు, గని మూసివేత నాటికి చేపట్టవలసిన  ఇతర చర్యలపై కేంద్ర బొగ్గు మంత్రి శాఖ అనుబంధ సంస్థ అయిన  కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ వారు కొన్ని నియమ నిబంధనలను సూచిస్తారు. ఈ నిబంధనలను  సంబంధిత కంపెనీ ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇవి అమలు చేయటానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి అంత మొత్తాన్ని సదరు కంపెనీ నుండి ముందస్తు జాగ్రత్తగా ఒక డిపాజిట్ రూపంలో తీసుకుంటారు.  కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తో పాటు, బొగ్గు గని యాజమాన్యం, బ్యాంకర్లు కలిసి ఈ మేరకు ఒక ఒప్పందం కుదుర్చుకొని సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. గని జీవితకాలం పూర్తి అయిన తర్వాత నిబంధనల ప్రకారం గని యాజమాన్యం హామీ ఇచ్చిన ప్రకారం పర్యావరణహిత చర్యలు పూర్తి చేసినట్లయితే సదరు డిపాజిట్ ను వడ్డీతో సహా తిరిగి గని యాజమాన్యానికి చెల్లిస్తుంటారు.ఇదేవిధంగా సింగరేణి సంస్థ బెల్లంపల్లి ఏరియాలో  డోర్లీ ఓపెన్ కాస్ట్-2  గనికి  2013- 14 లో  అనుమతులు పొందింది. నిబంధనల ప్రకారం గని ప్రారంభం నుంచి చివరి వరకు తాను చేపట్టనున్న పర్యావరణ హిత చర్యలకు సంబంధించి అంచనా వ్యయం సుమారు 26.79 కోట్ల రూపాయలను కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద డిపాజిట్ చేసింది. కాగా ఈ గని ఏడు సంవత్సరాలు పాటు బొగ్గును ఉత్పత్తి చేసిన తర్వాత 2023-24 లో మూసివేశారు.  అప్పటికే సింగరేణి సంస్థ దశలవారీగా ఒప్పందంలోని అంశాలను అమలు జరుపుతూ వచ్చింది. ఈ పనులు ఇచ్చిన హామీ ప్రకారం పూర్తి అయినాయా? లేదా? అనే అంశాన్ని ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శిబ్ పూర్ (పశ్చిమబెంగాల్) ద్వారా జులై, 2024లో నిర్వహించారు. ఆడిట్లో అన్ని సక్రమంగా జరిగాయని సింగరేణి సంస్థ నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు జరిపిందని పేర్కొన్నారు. ఫలితంగా ఏడేళ్ల క్రితం డిపాజిట్ చేసిన సొమ్మును వడ్డీతో సహా కలిపి తిరిగి సింగరేణి సంస్థకు చెల్లిస్తున్నట్లు డిప్యూటీ అసిస్టెంట్ కోల్ కంట్రోలర్ ఆకాష్ శివ హరే తమ లేఖలో ఇటీవల పేర్కొన్నారు. మొత్తం రూ.40 కోట్లు చెల్లించాల్సి ఉండగా దీనిలో 90% డిపాజిట్ సొమ్ము 36.63 కోట్ల రూపాయలను చెల్లిస్తున్నామని, మిగిలిన పది శాతం జస్ట్ ట్రాన్సిషన్ ప్రొవిజన్స్ అంశాలు పరిశీలించిన తర్వాత చెల్లిస్తామని పేర్కొన్నారు. అంటే దాదాపు రూ.40 కోట్లు తిరిగి సింగరేణి సంస్థ ఖాతాలో పడుతున్నాయి. దీనిపై సింగరేణి యాజమాన్యం తన సంతృప్తిని వ్యక్తం చేసింది.

సంస్థ పాటించిన నిబంధ‌న‌లు 

డోర్లీ ఓపెన్ కాస్ట్-2 గని తవ్విన ప్రాంతంలో గతంలో ఉన్న దట్టమైన అడవికి సమంగా తిరిగి 162.517 హెక్టార్ల విస్తీర్ణంలో దట్టమైన అడవులను పెంచి అందజేసింది. గని తవ్వకానికి ముందు ఆ ప్రదేశంలో ఉన్న సారవంతమైన భూమి పైపొర మట్టి (టాప్ సాయిల్) సుమారు 19.76 లక్షల క్యూబిక్ మీటర్ల పరిమాణంను తొలగించి వేరేచోట భద్రపరిచి, దానిని ఓవర్ బర్డెన్ డంపులపై తిరిగి పరిచి, వాటిపై మొక్కలను పెంచింది. అందువల్లనే డోర్లీ ఓవర్ బర్డెన్ డంపుల మీద దట్టమైన అడవిగా ప్లాంటేషన్ పెరిగింది.3. ఓపెన్ కాస్ట్ నిర్వహించిన సమయంలో వాతావరణ కాలుష్యం జరగకుండా డ్రిల్ మిషన్ల వద్ద డస్ట్ కలెక్టర్లను ఏర్పాటు చేసింది. వెట్ డ్రిల్లింగ్ నిర్వహించింది. 28 కిలో లీటర్ల సామర్థ్యం గల వాటర్ స్ప్రింక్లర్ ఒకటి, పది కిలో లీటర్ల సామర్థ్యం గల వాటర్ స్ప్రింక్లర్ లు రెండు వినియోగించి నిరంతరాయంగా ధూళి లేవకుండా చర్యలు తీసుకుంది.  కోల్ బంకర్లు సీ హెచ్ పీ ల వద్ద    మిస్ట్  స్పేయర్లను  ఏర్పాటు చేసింది.
4. హాల్ రోడ్లకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటి గ్రీన్ బెల్టులు ఏర్పాటు చేసింది. ఇలా అనేక రకాల చర్యలు తీసుకోవడంతో పాటు వాతావరణ కాలుష్యం నియంత్రణలో ఉన్న విషయాన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎన్విరాన్ మేంటల్  ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ వారి ద్వారా ఆడిటింగ్ జరిపింది.  5. ఓపెన్ కాస్ట్ వల్ల జల కాలుష్యం జరగకుండా ఉండేందుకు ఓపెన్ కాస్ట్ చుట్టూతా పది కిలోమీటర్ల పొడవైన  గార్ల్యాండ్ డ్రైనేజీ లు ఏర్పాటు చేసింది. రెండు చెక్ డ్యామ్ లను నిర్మించి బురద నీరు ప్రకృతిలో కలవకుండా చర్యలు తీసుకుంది. ఐదు సెటిలింగ్ ట్యాంకులను ఏర్పాటు చేసింది. గని నుంచి విడుదలయ్యే నీటిని శుభ్రపరిచి సమీపంలోని కాలువల్లోకి పంపించింది. ఈ విధంగా తీసుకున్న చర్యలను కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన పై సంస్థ ద్వారానే ఆడిటింగ్ జరిపించింది.

మూసివేసిన గని వద్ద రక్షణ ఏర్పాట్లను చేపట్టింది. సెక్యూరిటీ గార్డ్ లను నియమించడంతో పాటు సూపర్ వైజర్లను కూడా నియమించింది. గని చుట్టూ కంచెను ఏర్పాటు చేసింది.  గతంలో గని నిర్వహణ సందర్భంగా నిర్మించిన భవనాలను, నిర్మాణాలను సురక్షితంగా తొలగించింది.  ఈ చర్యలను, వీటికి అయిన ఖర్చులు పరిశీలన బృందం తనిఖీ చేసి సంతృప్తి చెందిన తర్వాత సింగరేణి సంస్థ డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి కంపెనీకి చెల్లిస్తున్నట్లు కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ తెలియజేసింది. దీనిపై డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సింగరేణి సంస్థ చిత్తశుద్ధితో చేపడుతున్న గని మూసివేత చర్యలకు నిదర్శనంగా కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారు డిపాజిట్ సొమ్మును తిరిగి కంపెనీకి చెల్లించారని గతంలో  ఒక భూగర్భ గనికి (ఆర్కే-8 ఇంక్లైన్, శ్రీరాంపూర్) సంబంధించి  రూ.4 కోట్ల డిపాజిట్ ను తిరిగి ఇదే విధంగా చెల్లించారని పేర్కొన్నారు.  మూసివేత దశలో ఉన్న మరికొన్ని గనుల్లోనూ ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు పటిష్ట పర్యావరణ హిత చర్యలు తీసుకుంటున్నట్లు  వివరించారు.  త్వరలో మరికొన్ని మూతబడిన గనులకు సంబంధించిన పనులు పూర్తి చేసి ఉన్నందున వాటి డిపాజిట్లు సింగరేణికి అందనున్నాయని పేర్కొన్నారు.  డోర్లీ-1 గనికి సంబంధించి కూడా తనిఖీలు చివరి దశలో ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి మరో రూ.60 కోట్లకు పైగా డిపాజిట్లు తిరిగి వచ్చే అవకాశం ఉందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *