– అన్ని సరుకులను ప్రజలకు ఇవ్వాలి
– బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్
న్యూదిల్లీ, ఆగస్టు 14: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఫొటో కచ్చితంగా పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రం తన వాటా కింద అధిక మొత్తంలో ఇచ్చే బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం లేదని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోలు కేంద్రం ఇస్తున్నవేనని ఎంపీ పేర్కొన్నారు. ఒక్క కిలో బియ్యం ఇస్తూ కార్డుపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలతో స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడాన్ని ఆక్షేపించారు. రాష్ట్రంలో 1.06 కోట్ల రేషన్ కార్డుల పంపిణీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సుమారు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, కొత్తగా ఎన్ని ఇస్తున్నారో ప్రభుత్వం వెల్లడించాలన్నారు. కార్డుల ముద్రణ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు, ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారనే వివరాలను వెల్లడించాలన్నారు. రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని, వారికి గౌరవ వేతనం చెల్లించాలని కోరారు. పెంచిన రేషన్ డీలర్ల కమీషన్‌ను వెంటనే ఇవ్వాలని, బియ్యంలో నూకలు ఎక్కువగా ఉన్నాయన్న ఫిర్యాదులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల ద్వారా పేదలకు మరిన్ని నిత్యావసర సరకులు అందించాలని సూచించారు. కర్ణాటక తరహాలో కందిపప్పు, నూనె, రాగులు, చక్కెర, గోధుమలు ఇవ్వాలని, బియ్యం వద్దనుకునే వారికి ప్రత్యామ్నాయ ఆహార ధాన్యాలు అందించాలన్నారు. రేషన్ కార్డుల పంపిణీని పునఃపరిశీలించాలని, మోదీ ఫొటోతో కొత్త కార్డులు ముద్రించాలని ఎంపీ రఘునందన్ డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



