ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆగిన ‘కల్యాణలక్ష్మి’

-పేదింటి పిల్లలకు శాపంగా మారిన కాంగ్రెస్‌ ‌తీరు
– ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే సబితారెడ్డి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, సంక్షేమ పథకాల పట్ల అనుసరిస్తున్న దగాకోరు విధానాల వల్లే పేదింటి ఆడపిల్లలకు ఆసరాగా నిలిచే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలపై హైకోర్టు స్టే విధించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను రుజువు చేసిందని మండిపడ్డారు. పేద వర్గాలకు ఈ పథకాల ఫలాలు అందకూడదనే దుర్బుద్ధితో, నిధులను ఎగ్గొట్టే కుట్రతోనే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కావాలని కోర్టు వ్యవహారాల్లో అలసత్వం వహించిందని విమర్శించారు. హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై కౌంటర్‌ ‌దాఖలు చేస్తామని గతంలో అడ్వొకేట్‌ ‌జనరల్‌ ‌స్పష్టం చేసినప్పటికీ న్యాయస్థానం పలుమార్లు అవకాశం ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. గత ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ ‌లబ్దిదారులకు ఆర్థిక సాయంతోపాటు అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్‌ ‌హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత తులం బంగారం ఇవ్వకపోగా పథకాన్ని కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రవేశపెట్టిన ప్రజాదరణ పొందిన పథకాలను పూర్తిగా రూపుమాపే కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఇలాంటి నాటకాలకు తెరలేపుతోందని దుయ్యబట్టారు. 2014 నుంచి బీఆర్‌ఎస్‌ ‌హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు రూ.13 వేల కోట్లకుపైగా వెచ్చించి లక్షలాదిమంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు కొండంత అండగా నిలిచామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రమత్తు వీడి వచ్చే విచారణ గడువైన సెప్టెంబరు 9లోగా ఉన్నత న్యాయస్థానంలో బలమైన కౌంటర్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. అవసరమైతే చట్టసభల ద్వారా ప్రత్యేక చట్టబద్ధత కల్పించి స్టే ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *