హర్ ఘర్ తిరంగా అభియాన్‌కు భారీ స్పందన

– తార్నాకలో ఘనంగా తిరంగా యాత్ర
– 200 మీటర్ల పొడవైన జాతీయ పతాకం ప్రదర్శన

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : తార్నాక డివిజన్‌లో హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో భాగంగా నిర్వహించిన ఘనమైన తిరంగా యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పాల్గొన్నారు. తార్నాక ప్రజలు, యువత, విద్యార్థులు రాజకీయాలకతీతంగా అధిక సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటారు. సుమారు 200 మీటర్ల పొడవైన భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ నిర్వహించిన ఈ తిరంగా యాత్ర దేశభక్తి, జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ తాను నివసిస్తున్న తార్నాక డివిజన్‌లో తిరంగా యాత్రలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తార్నాక ప్రజలు, యువత, విద్యార్థులు, కార్యకర్తలు జాతీయ భావాన్ని చాటుతూ తిరంగా యాత్రను విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. ప్రధాని మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అభియాన్‌కు యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారన్నారు.

పెద్దపల్లిలో తిరంగా ర్యాలీ

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ తిరంగా ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలతో బిజెపి శ్రేణులు, విద్యార్థులు, యువత, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నేషన్ ఫస్ట్(దేశమే ప్రథమం) అనే సంకల్పంతో కలసికట్టుగా పనిచేసి నవ భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ర్యాలీలో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, సీనియర్ నాయకుడు గోమాస శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి , రాష్ట్ర నాయకులు మనోహర్ రెడ్డి, సురేష్ రెడిjష్ట్ర తదితరులు పాల్గొన్నారు.

న్యాయవాదుల సంక్షేమానికి, రక్షణకు బీజేపీ కట్టుబడి ఉంది

న్యాయవాద వృత్తి అనేది అత్యంత పవిత్రమైనదని, సమాజంలో న్యాయాన్ని పరిరక్షించే సోషల్ ఇంజనీర్లుగా న్యాయవాదులు కీలక పాత్ర పోషిస్తున్నారని రామచందర్ రావు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాలోని న్యాయవాదులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు, విన్నపాలు స్వీకరించి మాట్లాడారు. న్యాయవాద వృత్తిలో ఒక ప్రత్యేకమైన గౌరవం, సేవా దృక్పథం ఉందన్నారు. అడ్వకేట్‌గా, బార్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేసిన అనుభవంతోపాటు ఒక ప్రజాప్రతినిధిగా ఏ ఊరు వెళ్లినా కోర్టులను సందర్శించడం తనకు అలవాటని గుర్తు చేసుకున్నారు. సమాజంలో నేరాలు పెరుగుతున్న తరుణంలో క్లయింట్ల తరఫున నిలబడి న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడులు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక న్యాయవాది మరణించిన ఘటనను ప్రస్తావిస్తూ అడ్వకేట్లపై దాడులను తీవ్రంగా ఖండించారు. న్యాయవాదులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, న్యాయవాదుల రక్షణ చట్టం తెచ్చే వరకు నిరంతరం పోరాడతానని రామచందర్ రావు స్పష్టం చేశారు.

న్యాయవాదుల సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పుతా

రాబోయే అసెంబ్లీ సమావేశాలలో న్యాయవాదుల సమస్యలపై, వారి రక్షణ చట్టంపై ప్రశ్న లేవనెత్తాలని, నిరంతరం ఒత్తిడి తీసుకురావాలని పార్టీ శాసనసభాపక్ష నాయకులతో(ఫ్లోర్ లీడర్‌తో) మాట్లాడినట్లు తెలిపారు. న్యాయవాదులు ఇచ్చిన వినతిపత్రాలను కూడా సభ దృష్టికి తీసుకెళ్తామని రామచందర్ రావు హామీ ఇచ్చారు. గతంలో హెడ్ క్వార్టర్స్‌లో కోర్టుల నిర్మాణం, డిస్ట్రిక్ట్ బార్లకు ఫండ్స్ పెంపుదలపై చేసిన పోరాటాలను గుర్తుచేస్తూ వెల్ఫేర్ స్టాంప్స్ ద్వారా లభించే సాయాన్ని సవరించి అడ్వకేట్ కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల ఆర్థిక భరోసా దక్కేలా బార్ కౌన్సిల్ ప్రతినిధులతో కలిసి కృషి చేసిన విధానాన్ని వివరించారు. ప్రజల ముంగిటకే న్యాయం అందించే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికీ చేరాలని, బార్ అసోసియేషన్లకు ఎలాంటి అవసరం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. డాక్టర్ రోగికి వైద్యం చేసినట్లే న్యాయవాది కూడా తన వృత్తి ధర్మానికి కట్టుబడి న్యాయం కోసం పోరాడతాడని, కావున సమాజం కూడా న్యాయవాద వృత్తిని గౌరవించాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *