విద్యార్థుల పోరాటానికి తలొగ్గిన మోదీ

-కేంద్రం దిగిరాక తప్పని పరిస్థితి
-మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌హర్షం
-కేంద్రం తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేతలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర ,జులై 25:కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా విద్యార్థుల సుదీర్ఘ ఉద్యమానికి దక్కిన విజయమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌పేర్కొన్నారు. విద్యార్థుల డిమాండ్లపై కేంద్రం దిగివచ్చిందని, ఈ పరిణామం ప్రభుత్వాలకు ఒక కనువిప్పుగా మారాలన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా విద్యార్థుల ఉద్యమానికి దక్కిన విజయమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. విద్యార్థుల హక్కులు, వారి భవిష్యత్తు కోసం దేశవ్యాప్తంగా వ్యక్తమైన ఆందోళనల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చిందని ఆయన అన్నారు. విద్యార్థుల ఆవేదనను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు గురైందని, చివరకు ప్రజల ఒత్తిడి ముందు తలవంచక తప్పలేదని వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఒక మంత్రి రాజీనామా మాత్రమే కాదని, ప్రజల గొంతుకకు లభించిన గౌరవమని పొన్నం ప్రభాకర్‌ అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఎంతటి ప్రభుత్వమైనా మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు. ఈ రోజు దిగివచ్చిన ప్రభుత్వం రేపు గ్దదె దిగక తప్పదని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యార్థుల ఆకాంక్షలను విస్మరించిన ప్రభుత్వాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా విద్యార్థుల ఉద్యమానికి, కాంగ్రెస్‌ ‌పార్టీతో పాటు బీజేపీయేతర రాజకీయ పక్షాల పోరాటానికి దక్కిన విజయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయని, వాటి ఫలితంగానే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకను ప్రభుత్వం గౌరవించక తప్పదని, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ ‌పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన పదవి కాపాడుకోవడానికే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించారని ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌ ‌విమర్శించారు. నీట్‌ ‌పరీక్ష లీక్‌ ‌జరిగినప్పుడే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఉంటే పరిస్థితి ఇంత వరకూ వచ్చేదే కాదన్నారు. మూడు నెలల పాటు ఎందుకు తాత్సారం చేశారని ప్రశ్నించిన ఆయన.. విద్యార్థులపై పెరిగిన ఒత్తిడి, నిరసనల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా విద్యార్థుల పోరాటానికి దక్కిన విజయమని పేర్కొన్నారు. యువత తమ దమ్ము ఏంటో నిరూపించారని, వారి పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఆందోళనల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. భవిష్యత్తులో పేపర్‌ ‌లీకులు జరగకుండా కఠిన చర్యలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా దేశ విద్యార్థులు, యువత పోరాటానికి దక్కిన విజయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ అన్నారు. ఈ పరిణామంతో బీజేపీ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, నీట్‌ ‌ప్రశ్నపత్రాల లీక్‌పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ ‌చేశారు. యువతకు న్యాయం జరిగే వరకు రాహుల్‌ ‌గాంధీ, కాంగ్రెస్‌ ‌పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకుని పరీక్షల నిర్వహణలో లోపాలను సరిదిద్దాలని కేంద్రాన్ని కోరారు. విద్యార్థుల డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని ప్రొఫెసర్‌ ‌కోదండరాం అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా విద్యార్థుల సుదీర్ఘ పోరాటానికి దక్కిన విజయమని పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రస్తుత ప్రభుత్వాలతో పాటు భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలకు కూడా ఒక కనువిప్పుగా మారాలని అన్నారు. విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *