మోదీ సోషల్ ‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాలి

– ప్రధాని పదవికి మోడీ రాజీనామా చేస్తేనే మంచిది
– రాష్ట్రాల్లో విద్యార్థులను వేధిస్తే మళ్లీ ఆందోళన తప్పదు
– కాక్రోచ్‌ ‌చీఫ్‌ అభిజిత్‌ ‌దీప్కే హెచ్చరిక

పుణె, జూలై 30 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేసి సోషల్ ‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాలని కాక్రోచ్‌ ‌జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ ‌దీప్కే ఎద్దేవా చేశారు. దేశాన్ని పాలించడం కంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మోదీ బాగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని నడిపే బాధ్యతను మరో నాయకుడికి అప్పగించాలన్నారు. దిల్లీలో నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా తర్వాత తొలిసారి తన స్వస్థలమైన మహారాష్ట్రకు అభిజీత్‌ ‌చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ దిల్లీలో ఆందోళనలను విరమించిన తర్వాత వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థి నిరసనకారులను గుర్తించి వేధిస్తున్నాయని ఆరోపించారు. ఆయా ప్రభుత్వాలు వెంటనే ఈ వేధింపులను ఆపాలని, లేకపోతే రానున్న ఎన్నికల్లో విద్యార్థులు, యువత తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామాతో విద్యార్థుల్లో ఉన్న ఆగ్రహం ఏమాత్రం తగ్గలేదన్నారు. యువత ఆగ్రహం ఒక్క మంత్రిపై కాదని, కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని అన్నారు. యువతలో ఉన్న అసంతృప్తిని బీజేపీ ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతోందని అభిజీత్‌ ‌విమర్శించారు. ఇలాగే విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటే ఉద్యమం ఉద్ధృతమవుతుందని అభిజీత్‌ ‌హెచ్చరించారు. వీరు ఉగ్రవాదులు కాదని, దేశ భవిష్యత్తని ఆయన పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును ఇలాంటి పరిస్థితులకు గురి చేస్తే ధర్మేంద్ర రాజీనామా చేసినట్లే అవసరమైతే ప్రభుత్వాన్నీ మార్చే ఉద్యమం చేపడతామని తేల్చిచెప్పారు. దిల్లీ జంతర్‌మంతర్‌లో సీజేపీ నిరసన సందర్భంగా విద్యార్థులపై పెల్లెట్‌ ‌గన్‌ ‌వినియోగించిన ఘటనపైనా అభిజీత్‌ ‌స్పందించారు. అమిత్‌ ‌షా అయినా, మరెవరైనా సరే పెల్లెట్‌ ‌గన్‌ ‌కాల్పులకు ఆదేశాలు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా అనంతరం సీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకోవడంపై వచ్చిన విమర్శలను సీజేపీ వ్యవస్థాపకుడు తిప్పికొట్టారు. కార్యకర్తలు 36 రోజులపాటు ఎండ, వర్షాన్ని లెక్కచేయకుండా పోరాడారని, అలాంటి విజయం తర్వాత సంబరాలు చేసుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ కూడా సంబరాలు చేసుకుంటుందని గుర్తు చేశారు. తమ కార్యకర్తలు బీజేపీ మాదిరిగా రహదారులను దిగ్బంధం చేయలేదన్నారు. రాజీనామా చేసిన ధర్మేంద్రను పార్లమెంట్‌లో బీజేపీ సన్మానించడం సిగ్గుచేటని విమర్శించారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత ఆయనను సన్మానించడం ద్వారా బీజేపీ ఏ సందేశం ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. పేపర్‌ ‌లీక్‌ ‌కేసుల విషయంలో కేంద్రం మాటలకు, చేతలకు పొంతన లేదని అభిజీత్‌ ఆరోపించారు. ప్రధాని మోదీ మూడు రోజుల క్రితం పేపర్‌ ‌లీక్‌ ‌కేసుల కోసం ఫాస్ట్‌ట్రాక్‌ ‌కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, అయితే తొలి విచారణకే సీబీఐ తరఫు న్యాయవాది హాజరుకాకపోవడంతో కేసు వాయిదా పడిందని తెలిపారు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ ‌విమర్శలపైనా అభిజీత్‌ ‌స్పందించారు. ఆమె పార్ట్‌టైమ్‌ ‌రాజకీయ నాయకురాలని, సీరియస్‌ ‌రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలకే తాను స్పందిస్తానని వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *