– పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
– ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత నదులు
– మేడిగడ్డ వద్ద వరద ఉధృతితో 85 గేట్లు ఎత్తివేత
– శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి
– కడెం జలాశయానికి భారీగా వరద నీరు చేరిక
– భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి మట్టం
– ములుగు జిల్లా బొగత జలపాతం సందర్శన నిలిపివేత
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే రానున్న మరో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు నదులు, ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్రల్లోని ఎగువ ప్రాంతాల్లో వర్షాపాతం తీవ్రమవడంతో గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయాలు సంతరించుకుంటున్న జలకళ రైతుల్లోనూ, ప్రజల్లోనూ తీవ్ర ఆనందాన్ని నింపుతోంది. నిజామాబాద్ జిల్లాలోని ప్రతిష్టాత్మక శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 12,900 క్యూసెక్కుల ఇన్ ప్లో వస్తుండగా, ప్రాజెక్టు నీటి నిల్వ 17.103 టీఎంసీలకు చేరింది. కాకతీయ కాలువ ద్వారా దిగువకు 300 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. అలాగే, నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలంలో ఉన్న స్వర్ణ ప్రాజెక్టుకు ఉదయం వేళకు నీటి సామర్థ్యం అర టీఎంసీ దాటి, ఇన్ ప్లో దాదాపు 10 వేల క్యూసెక్కులకు చేరింది. నిర్మల్ జిల్లాకే తలమానికమైన కడెం ప్రాజెక్టుకు వరద నీరు విపరీతంగా పోటెత్తుతోంది. ఉదయం 11:00 గంటల సమయానికి కడెం ప్రాజెక్టుకు ఏకంగా 77,442 క్యూసెక్కుల భారీ ఇన్ ఫ్లో నమోదు కాగా, పరిస్థితికి అనుగుణంగా అధికారులు 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద ప్రాణహిత, గోదావరి ఉభయ నదులు పరవళ్లు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అక్కడ నీటిమట్టం 6.320 టర్ల ఎత్తులో మెట్ల వద్దకు చేరడంతో తీరం కొత్త రూపు సంతరించుకుంది. గోదావరి జలాలు పోటెత్తడంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి ఇన్ ప్లో భారీగా పెరిగింది. ఎన్డీఎస్‌ఏ సూచనలను పాటిస్తూ అధికారులు బ్యారేజ్ కి చెందిన మొత్తం 85 గేట్లను ఎత్తి ఉంచారు. ప్రస్తుతం అక్కడ ఇన్‌ప్లో, అవుట్ ప్లో సమంగా 1,01,530 క్యూసెక్కులుగా కొనసాగు తుండటంతో గోదావరి ప్రవాహం దిగువకు వేగంగా పయనిస్తోంది. ప్రాజెక్టుల్లో క్రమంగా నీటి నిల్వలు పెరుగుతుండటంతో నీటిపారుదల శాఖ అధికారులు పరిస్థితిని నిరంతరం సక్షిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురియ నుండటంతో 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో 6 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలకు ఉత్తర తెలంగాణతో పాటు నిజామాబాద్ జిల్లాలోని చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలను దృష్టిలో పెట్టుకొని జగిత్యాల జిల్లాలో పాఠశాలలకు సెలవను ప్రకటించారు. ఈ సీజన్‌లో తొలిసారిగా జూరాల ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదలారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితోపాటు, పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటిమట్టం పెరుగుతోంది. గురువారం ఉదయానికి 27 అడుగులకు చేరింది. నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తున్నది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు 6 వరద గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇన్ ప్లోగా ప్రాజెక్టులోకి 77,442 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు 6 వరద గేట్లు 10 ఫీట్లు గేట్లు ఎత్తి అవుట్ ఫ్లోగా 67, 000 క్యూసెక్కుల నీటిని దిగవనున్న గోదావరిలోకి అధికారులు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు 3.495 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 693.725 అడుగులు 2.212 టీఎంసీలలో ప్రాజెక్టు నీటి సామర్థ్యం కొనసాగుతుంది. కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రవాహ ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్లకూడదని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు మత్తడి పారుతున్నాయి.


ఆదిలాబాద్ సహా ఇంద్రవెల్లి, తలమడుగు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉట్నూరు, నార్నూరు, జైనూరు మండలాల్లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి నర్సాపూర్, శాంతాపూర్ వాగులు పొంగాయి. దీంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజ్‌కి వరద ప్రవాహం పోటెత్తుతుంది. గురువారం బ్యారేజ్ వద్ద 81,060 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా బ్యారేజ్‌లోని 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరదనీటిని భారీ నీటిపారుదల శాఖ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బ్యారేజీకి వరద ప్రవాహం మరింత పెరుగుతుందని, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. ములుగు జిల్లా వాజేడు మండలం లో కురుస్తున్న భారీ వర్షానికి చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగర బొగత జలపాతం ఉప్పొంగింది. జలపాతం ముందు ఉన్న సెల్ఫీ వ్యూ పాయింట్‌పై నుంచి స్విమ్మింగ్ పూల్ దుగా ఉధృతంగా ప్రవహించింది. దీంతో బొగత సందర్శనకు అటవీశాఖ అధికారులు మధ్యాహ్నం నుంచి అనుమతి నిలిపివేశారు. తాము టికెట్ తీసుకొని లోపలకు వెళ్లగా అనుమతి లేదని బయటకు పంపించారని, టికెట్ డబ్బులు ఇవ్వాలని అడిగినా అధికారుల నుంచి సమాధానం కరువైందని కొందరు పర్యాటకులు ఆరోపించారు. ఈ విషయంపై ఇన్‌చార్జి రేంజ్ అధికారి నరేందర్‌ను అడగగా అలాంటిదే లేదని, జలపాతం వీక్షించిన తర్వాతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బయటకు పంపించామని తెలిపారు. ఉదయం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయిన వర్షపాతం వివరాలు ఇలావున్నాయి. వాజేడులో అత్యధికంగా వాజేడులో 16.5 సెం.. ఏటూరునాగారం, 15.2, సర్వాయిపేటలో 14.3, జైపూర్‌లో 14 సెం., బెజ్జూరులో 14, సెం.., కన్నాయిగూడెంలో 13 సెం.., వెంకటాపురం, 12.6, ముత్తారం, మహదేవ్‌పూర్ లో 12.2 సెం.., నస్పూర్ 11.8 సెం.. ఆసిఫాబాద్‌లో 11.3 సెం.., సింగరేణి(రెబ్బన)లో 11.2 సెం.., కాగజ్‌నగర్, మేడారంలో 10.6 సెం.., సిర్పూర్(టి)లో 10.5 సెం.., కౌతాలంలో 104, కాటారంలో 10.3, నెన్నెలలో 10.3 సెం.. వర్షపాతం నమోదయింది.
వర్షాలపై మంత్రి కోమటి రెడ్డి ఆరా 
రాష్ట్రంలోలో రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల ముందు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలు, ఆర్ అండ్ బీ డివిజన్ల వారీగా రోడ్లు, బ్రిడ్జిలు, లో కాజ్‌వేలు, కల్వర్టుల వివరాలపై ఆరా తీశారు. ముంపు ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కల్వర్టులులో కాజ్‌వేలు, కోతకు గురైన రోడ్ల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టాలన్నారు. అధికారులు అందరూ ఫీల్డ్‌లో ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రోడ్లు, బ్రిడ్జిల వద్ద తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఇరిగేషన్ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రతి రోజు ఫీల్డ్ రిపోర్ట్ తయారు చేయాలని, క్షేత్రస్థాయి ఇంజినీర్లతో మొబైల్ ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని వెల్లడించారు. ఈఎన్సీ నుంచి ఏఈ వరకూ అందరు పూర్తి అలెర్ట్‌గా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
నగరంలో ట్రాఫిక్ పోలీసుల సూచనలు
భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. నగరంలోని కంపెనీలు, సంస్థలు సాధ్యమైన చోట వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని సూచించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉద్యోగులకు విడతల వారీగా ముందస్తు లాగౌట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా చూడడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రయాణ ప్రమాదాలు తగ్గించి, రహదారులపై ట్రాఫిక్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. సంస్థలు తమ కార్యాలయ స్థానం, ముందస్తు లాగౌట్ సమయాలను ట్రాఫిక్ పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేయాలని సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వర్షం పడుతున్నప్పుడు జాగ్రత్తగా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.





