– కాంగ్రెస్ దుర్మార్గంతో మూడు తరాలుగా ఇబ్బందులు
– పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసిందే కేసీఆర్
– కొండగల్ పర్యటనకు పాలమూరుకు సంబంధం ఏంటో
– జిల్లాలో మిగిలిన 13 నియోజకవర్గాల మాటేంటి?
– 35 నెలల కాలంలో జిల్లాకు రేవంత్ చేసిందేంటి?
– కాళేశ్వరంలో మూడు పిల్లర్లు బాగుచేయడానికి మూడేళ్లూ సరిపోలేదా?
– కేటీఆర్ గడ్డం రేవంత్ కు ఎక్కడ అడ్డంపడింది? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10: పాలమూరు పచ్చబడ్డదే కేసీఆర్ నాయకత్వాన. కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రంలో పాలమూరును కలపకుంటే అప్పర్ కృష్ణా, భీమా, ఆర్డీఎస్, తుంగభద్ర హై లెవెల్ కాలువల ద్వారా 1960 దశకం నాటికే పాలమూరులో 20 లక్షల ఎకరాలు గ్రావిటీ ద్వారా పాలమూరు జిల్లాలో పారి ఉండేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ పాలమూరు గొంతు కోసిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు.అప్పట్లోనే గ్రావిటీ ప్రాజెక్టులు కట్టుకుని ఉంటే ఈ రోజు పాలమూరు రైతాంగం లిఫ్టుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది కాదన్నారు. తల్లి చనిపోతే దినాలు, కర్మ చేసుకోవడానికి నెత్తిన నీళ్లు చల్లుకోవడానికి కరెంటు లేదు, నీళ్లు లేవని శాసనసభలో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పుకున్నాడని గుర్తు చేశారు. కాంగ్రెస్ చేసిన దుర్మార్గం, విధ్వంసం మూడు తరాల పాలమూరు కోలుకోకుండా చేసిందన్నారు. కాంగ్రెస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా రూ.35వేల కోట్లతో కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చేశారన్నారు. పంటలు వేయొద్దని చెప్పిన మొదటి సీఎంగా రేవంత్ రెడ్డి నిలబడిపోతాడు.. ఆరుతడి పంటలు వేయమని చెప్పారు.. మరి ఇవాళ నీళ్లు, కరెంటు సంగతి ఏంటన్నది ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటైన వేదికల మీద తన పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడం, అక్కడ రాజకీయాలు మాట్లాడడం, అందులో ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని దూషించడం రేవంత్ కే చెల్లిందని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థానానికి ఉండే మర్యాదను ఏనాడు కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయకపోవడం బాధాకరమన్నారు. సొంత నియోజకవర్గానికి వెళ్లడంలో ప్రత్యేకత ఏంటి? కొడంగల్ పర్యటనకు పాలమూరుకు ఏం సంబంధం? మిగిలిన 13 నియోజకవర్గాలకు చేసింది ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి చేయడంతోపాటు, రాష్ట్రంలోని అయిదు, ఆరు నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాలకు లక్ష ఎకరాల చొప్పున నీళ్లు ఇవ్వాలన్న సంకల్పంతో పనిచేసి సాగునీరు అందించారని గుర్తు చేశారు. 35 నెలలలో పాలమూరుకు పట్టుమని రేవంత్ రెడ్డి చేసిన పనులు ఏంటి? పాలమూరు ప్రజలకు వచ్చిన ఉపాధి ఏంటి చూపించాలి? కనీసం అదనంగా ఒక్క ఎకరాకు అయినా సాగునీళ్లు వచ్చాయా? పదేపదే ప్రశ్నిస్తే మొక్కుబడిగా పాలమూరు ప్రాజెక్టులు సందర్శించి చేతులు దులుపుకుని వెళ్లారన్నారు. జూరాలలో 9 టీఎంసీల నీళ్లున్నా రైతులకు ఇవ్వకుండా వేధించారు. తాగునీటి పేరుతో పొలాలు ఎండబెడితే రైతులే స్వయంగా నీళ్లు వదులుకున్నారు. ప్రస్తుతం పంటలు చివరి దశకు వచ్చాయన్నారు.
కర్ణాటకలో 17 లక్షల ఎకరాలలో వరి సాగు చేశారు. కిందకు నీళ్లు వస్తాయని చెప్పినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కర్ణాటక నుండి నీళ్లు విడుదల చేయాలని ప్రభుత్వం కనీసం ఒక్క లేఖ కూడా రాయలేదు.. వచ్చిన నీళ్లను ఎలా వినియోగించుకోవాలో ఈ ప్రభుత్వానికి ప్రణాళిక, చిత్తశుద్ధి లేదన్నారు. జూరాల దిగువకు ఈ ఏడాది 245 టీఎంసీలు నీళ్లు వచ్చాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో శ్రీశైలం నుండి అధికారికంగా 75 టీఎంసీలు, అనధికారికంగా 20 టీఎంసీలు ఏపీ తరలించుకుపోయింది. గత 45 రోజులుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పంపులు నడిపితే నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండేది. దాంతో భూగర్భజలాలు పెరిగేవన్నారు.కేవలం మూడు వంతెనల వద్ద మట్టి తీస్తే సాగునీరు తరలించే అవకాశం ఉండేది. అఖిలపక్ష సమావేశంలో ఈ విషయం చెబితే నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదన్నారు. అధికారంలోకి రాగానే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాలువల టెండర్లను రద్దుచేసిందే రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఖర్చు చేస్తే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందేది కదా. కొండగల్ ఎత్తిపోతల ద్వారా సాగునీళ్లు వచ్చేది ఎన్నడో కానీ ఇప్పటికే రావాల్సిన సాగునీటిని రాకుండా చేశారన్నారు 10, 15 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తే మరో 15 లక్షల మందికి ఉపాధి లభించేది. కాళేశ్వరం మీద పగబట్టావు మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను నిలపడానికి కారణం ఏంటి ? కాళేశ్వరంలో మూడు పిల్లర్లను సరిచేయడానికి మూడేళ్లుగా అడుగు ముందుకు పడడం లేదు. ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పంపులను ఆన్ చేసి నీళ్లను ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. ఎల్ నినో నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని ఏడెనిమిది నెలలుగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సూచనలు చేస్తున్నాయి. తెలివైన ప్రభుత్వం ప్రజలకు ధైర్యం చెబుతూనే మరోవైపు నిర్దిష్ట కార్యాచరణ చేయాలి. ఎనిమిది నెలల తర్వాత అఖిలపక్ష సమావేశం పెట్టి అందులో వచ్చిన సూచనలను ఒక్కటీ అమలు చేయలేదు. 24.40 లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయాయని ప్రభుత్వమే చెప్పింది. వాస్తవంగా ఇది 30 లక్షల వరకు ఉంటుంది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం అయినా ఈ 24.40 లక్షల ఎకరాలలో నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం పరిహారం ఇస్తుందా? ఇవ్వదా? ప్రకటించాలి. కేసీఆర్ హయాంలో పంటలు దెబ్బతింటే నిబంధనలు అనుమతించకున్నా ఎకరాకు రూ.10 వేలు అందజేశామని గుర్తుచేశారు.
ఉస్మానియాకు వెళ్లి వెయ్యి కోట్లు అని హామీ ఇచ్చాడు. ఏడాది దాటినా దిక్కు లేదు. కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, స్కూటీ, విద్యార్థుల పారితోషికాలు ఎక్కడికి పోయాయి? దేశంలో అత్యంత విఫల సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ అన్నారు. సీఎం స్థాయి వ్యక్తి గడ్డం, మీసాల గురించి మాట్లాడతాడా? కేటీఆర్ గడ్డాలు, మీసాలు రేవంత్ రెడ్డికి దేనికి అడ్డం వచ్చాయి? దేశంలో గడ్డం పెంచుకున్నది మొదట రేవంత్ రెడ్డేనా?వ్యక్తిగత ఆహార్యం గురించే దిగజారుడు స్థాయి ఏంటని ప్రశ్నించారు. కేటీఆర్ పొరపాటున కూడా రేవంత్ రెడ్డి కాడు. కేటీఆర్ కేటీఆరే. ఎవరి దక్షత, అవగాహన వారికి ఉంటది. రేవంత్ భాష మార్చుకుంటే బాగుంటుందని హితవు పలికారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డికి ప్రజల్లో అంత అభిమానం ఉంటే పది నియోజకవర్గాల నుండి ప్రజలను ఎందుకు తీసుకుపోయారు? పాలమూరు పనులు పూర్తి చేసి సాగునీళ్లు అందించి ఉంటే ప్రజల్లో ఆదరణ ఉండేది. కేసీఆర్ మీద కక్షతో పనులు నిలిపివేశారు. కొడంగల్ ప్రజలకు జరిగిన తక్షణ లాభం ఏంటి? కొడంగల్ లో పనులు చేస్తున్నది అంతా ఆంధ్రా కాంట్రాక్టర్లే. అక్కడ కాంగ్రెస్ నాయకులను అడిగినా ఈ విషయం చెబుతారు. ఈ మీడియా సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, కొప్పుల మహేష్ రెడ్డి, మాజీ శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





