గిరిజనుల నిధులు, భూములు గోల్‌మాల్‌

– ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2,730 కోట్లు కేటాయించి రూ.70 కోట్లే ఖర్చు
– తండాలను జీపీలుగా మార్చి రాజ్యాధికారం ఇచ్చాం
– కాంగ్రెస్‌ వచ్చాక గిరిజనుల భూములు గుంజుకుంటోంది
– లగచర్లలో భూములు ఇవ్వబోమన్నందుకు గిరిజనులకు బేడీలు
– యువత జాబ్‌ సీకర్స్‌ కాదు.. జాబ్‌ క్రియేటర్స్‌ కావాలి :  హరీశ్‌రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : గిరిజనుల సంక్షేమానికి కేటాయించిన నిధులను కాంగ్రెస్‌ ప్రభుత్వం సక్రమంగా ఖర్చు చేయడం లేదని బీఆర్ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు ఆరోపించారు. గిరిజన యువత ఉద్యోగాల కోసం వెతికే స్థాయి నుంచి పదిమందికి ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. సిద్దిపేటలో ట్రైబల్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ  ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సు, సిద్దిపేట జిల్లా చాప్టర్‌ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గిరిజన యువతకు వ్యాపార అవకాశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలపై అవగాహన కల్పిస్తూ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గిరిజన యువతకు మార్గదర్శకంగా నిలవడంతోపాటు వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రెజర్‌ గ్రూప్‌గా కూడా  పనిచేయాలని సూచించారు. నిజామాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన రమేష్‌ నాయక్‌ లండన్‌లో 16 హోటళ్లు స్థాపించి గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగారని, బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో టీ-ప్రైడ్‌ ద్వారా సహకారం పొందిన సురేష్‌ నాయక్‌ హైదరాబాద్‌లో హార్లిక్స్‌ బర్త్‌డే కేకులు తయారు చేస్తూ పెద్ద కంపెనీలతో పోటీపడుతున్నారని ఉదాహరణలుగా పేర్కొన్నారు. ఇలాంటి విజయగాథల నుంచి గిరిజన యువత స్ఫూర్తి పొందాలన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో గిరిజన అభివృద్ధికి వందల కోట్ల సబ్సిడీలు అందించామని, గిరిజన మహిళల కోసం రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశామని, అనేక గురుకులాలను నిర్మించి నాణ్యమైన విద్యను అందించామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచామని, దీంతో ఎంతోమంది గిరిజన యువత డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదిగారన్నారు. రాష్ట్రంలోని 3,300 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజన బిడ్డలను సర్పంచులుగా చేసి వారికి రాజ్యాధికారం అందించామని తెలిపారు. జనాభా ప్రాతిపదికన కేటాయించిన నిధులు ఆర్థిక సంవత్సరంలో ఖర్చు కాకపోతే మరుసటి ఏడాదికి క్యారీ ఫార్వర్డ్‌ అయ్యేలా ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేశామని చెప్పారు. ఆరు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనులను రైతులుగా మార్చామన్నారు. ప్రస్తుత  ప్రభుత్వం గిరిజనులకు తీవ్ర ద్రోహం చేస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. మేనిఫెస్టోలో పదో తరగతి పాస్‌ అయితే రూ.10వేలు, పీజీ చేస్తే రూ.2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదన్నారు. అసెంబ్లీలో తాము ప్రశ్నించినప్పుడు ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2,730 కోట్లు కేటాయించామని ప్రభుత్వం చెప్పిందని, అయితే ఖర్చు చేసింది రూ.70 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఒక్క గిరిజన బిడ్డకు కూడా ఉపాధి కల్పించలేదని విమర్శించారు. ఎస్టీ ఎస్డీఎఫ్‌ నిధులను బడ్జెట్‌లో కేటాయిస్తున్నా వాటిలో సగం కూడా ఖర్చు చేయడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం లక్ష ఎకరాల అసైన్డ్‌ భూములను గుంజుకుని పేదలను రోడ్డున పడేసిందని హరీశ్‌రావు ఆరోపించారు. గిరిజనుల భూములను లాక్కుని ముఖ్యమంత్రి సోదరుడు కొండల్‌రెడ్డి, అల్లుడు సత్యకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. గిరిజన యువతకు అన్యాయం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో టీఐసిసిఐ మరింత చురుగ్గా పని చేయాలని హరీశ్‌రావు కోరారు. ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలను రాబట్టేందుకు కృషి చేయాలని సూచించారు. జిల్లాలోని ఎస్టీ యువత టీఐసిసిఐ సేవలను సద్వినియోగం చేసుకుని సభ్యులుగా చేరాలని, నైపుణ్యాలను పెంచుకుని ఉద్యోగాలు కల్పించే స్థాయిలో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని హరీశ్‌రావు సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *