హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం (PM e-drive scheme) కింద హైదరాబాద్ కి రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి కుమార స్వామి ప్రకటించడం పట్ల రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈవీ పాలసీ తీసుకొచ్చిందని 100 శాతం టాక్స్ మినహాయింపు చేస్తున్నామని పేర్కొన్నారు. దాంతో పాటు హైదరాబాద్ నగరంలో ఓఆర్ఆర్ లోపల 2800 పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి గతంలో కేంద్ర మంత్రి కుమార స్వామి ని కలిసి విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి నీ పరిగణన లోకి తీసుకొని హైదరాబాద్ నగరానికి ప్రధాన మంత్రి ఈ డ్రైవ్ పథకం కింద రెండు వేల బస్సులు కేటాయిస్తామని తెలపడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన 800 ఎలక్ట్రిక్ బస్సులు కూడా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
విద్యుత్ బస్సుల కేటాయింపుపై కేంద్రానికి పొన్నం ధన్యవాదాలు
