- లేఖను సృష్టించాల్సిన అవసరం మాకు లేదు
- ఎవరు ప్లాన్ చేశారో నాకు తెలుసు
- మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్,ప్రజాతంత్ర,మే 23: ఆర్టిఫిషియల్ లేఖను కూడా ఎమ్మెల్సీ కవిత సరిగా రాయలేక పోయారని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) విమర్శించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. లెటర్ ఆలోచన ఎలా వచ్చిందో, ఎక్కడ ప్లాన్ వేశారో తనకంతా తెలుసన్నారు. తన తండ్రి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత రాసినట్టు చెబుతున్న లేఖపై ఆయన స్పందిస్తూ లేఖకు, ఎమ్మెల్సీ కవితకు సంబంధమే లేదన్నారు. ఆ లేఖ.. ఓ జోక్ అని వ్యాఖ్యానించారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసింట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కలిసి కవిత పేరుతో లేఖ సృష్టించారని ఆరోపించారు. 20 లేదా 30 సీట్లలోనే బిఆర్‌ఎస్ పోటీ చేస్తుందని, బిఆర్‌ఎస్ వచ్చే ఎన్నికల్లో బిజెపితో కలుస్తుందని జోస్యం చెప్పారు. వందేళ్లయినా కెసిఆర్ కుటుంబం కలిసే ఉంటుందని, కెసిఆర్ కుటుంబంలో కలహాలు అనేది పెద్ద డ్రామా అన్నారు. కవిత గురించి ఆలోచించే సమయం తనకే లేదని, ఇక మా సిఎం రేవంత్ రెడ్డికి ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. వరంగల్ లో కెసిఆర్ పెట్టిన సభ తాను ఒక్కడినే పెట్టగలనని కోమటి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భారాసకు భవిష్యత్తు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ రాసే లేఖ ఓ పద్ధతిగా ఉందా? ఆ లేఖను సృష్టించాల్సిన అవసరం మాకేంటి? భారాసలో చీలిక లేదు.. ఇదంతా ఓ డ్రామా. దానిలో భాగమే ఈ లేఖ. తండ్రికి లేఖ రాయాల్సిన అవసరమేంటి? ఆమె నేరుగా చెప్పొచ్చు కదా! కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు వస్తాయంటే ఎవరైనా నమ్ముతారా? వారు గొడవపడరు.. ఒకవేళ అలా జరిగితే అది ఆస్తుల గురించే అవుతుందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.