– అమోయ్ విచారణతో వెలుగుమట్ల అక్రమార్కుల్లో వణుకు
ఖమ్మం, ప్రజాతంత్ర, మే 22 : రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న భూదాన్ భూముల కుంభకోణం వ్యవహారం ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయ, అధికార వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఆచార్య వినోబాభావే నాడు పేదల సాగు, గూడు కోసం సేకరించిన పవిత్రమైన భూదాన్ భూములను కొందరు రికార్డుల మాయాజాలంతో ప్రైవేటు శక్తులకు కట్టబెట్టడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌కు ఈడీ సమన్లు జారీ చేయడం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం భూములపై దర్యాప్తును ముమ్మరం చేయడంతో.. దీని అంతర్గత లింకులు ఖమ్మం నగర పరిధిలోని అత్యంత విలువైన వెలుగుమట్ల భూదాన్ భూముల వైపు లాగుతున్నాయి. ఒకే రకమైన వ్యూహంతో సాగిన ఈ భూ దోపిడీ వెనుక ఉన్న బడా బాబుల గుట్టురట్టు చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ రంగం సిద్ధం చేయడంతో ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రిమినల్ కేసుల ఆధారంగా ఈడీ ప్రస్తుతం తన దర్యాప్తును వేగవంతం చేసింది. అక్కడ సుమారు 42 ఎకరాల అత్యంత విలువైన భూదాన్ భూములను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు బదలాయించారనే ఆరోపణలపై గతంలోనే ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌ను అధికారులు ప్రశ్నించారు. అయితే, ఈ వ్యవహారంలో కేవలం మహేశ్వరానికే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన వ్యూహంతో భూములు చేతులు మారాయని ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. దీంతో ఈ విచారణ పరిధి విస్తరిస్తే, రాష్ట్రంలోనే అత్యంత వివాదాస్పదంగా మారిన ఖమ్మం వెలుగుమట్ల పరిధిలోని సర్వే నంబర్ల ఫైళ్లు కూడా ఈడీ రాడార్‌లోకి రావడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి.
వెలుగుమట్లలో రికార్డుల మాయాజాలం
కలెక్టరేట్ కూత వేటు దూరంలో వెలుగుమట్లలో భూదాన్ ట్రస్టు బోర్డుకు సంబంధించి సర్వే నంబర్లు 147, 148, 149లో సుమారు 62.7 ఎకరాల భూమి ఉంది. జిల్లా అధికారులు మాత్రం 31 ఎకరాల 7 గుంటల భూమినీ రాజా రామారావు భూదాన్ ఉద్యమంలో దానం చేశారని తెలిపారు. మిగిలిన భూమి ప్రైవేట్ భూమి అని తెలిపారు. కొంత కాలం ప్రభుత్వ పరిధిలో ఉన్నా భూమి కొన్నాళ్ల తరవాత ప్రైవేట్ భూమి ఎలా మారిందనేది సగటు జిల్లా వాసిని కలవరపరుస్తోంది. ఖమ్మం నగరానికి అత్యంత ఆనుకుని ఉండి, నేడు వందల కోట్ల రూపాయల విలువ పలికే వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూములు గత కొన్నేళ్లుగా వివాదాల సుడిగుండంలో ఉన్నాయి. భూదాన్ బోర్డులోని అసలు రికార్డులను మాయం చేయడం లేదా నిబంధనలను తమకు అనుకూలంగా మార్చేయడం ద్వారా ఇక్కడి భూములను కొల్లగొట్టారు. ఉన్నతాధికారుల ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ రూలింగ్స్‌ను, వివాదాస్పద కోర్టు ఆర్డర్లను అడ్డం పెట్టుకుని రాత్రికి రాత్రే బినామీల పేరిట రెవెన్యూ రికార్డులను సృష్టించారు. నాటి పేద రైతులను, స్థానికులను దౌర్జన్యంగా ఖాళీ చేయించి, ఆ స్థలాల్లో రాత్రికి రాత్రే ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్లు, కమర్షియల్ ప్రాజెక్టులు వెలిసేలా చేశారనే బలమైన ఆరోపణలు వెలుగుమట్ల పరిధిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నెల 25న జరిగే కీలక విచారణకు మూడు ముఖ్యమైన సేల్ డీడ్ పత్రాల సంపూర్ణ వివరాలతో హాజరుకావాలని ఈడీ అమోయ్ ను ఆదేశించడం వెనుక పెద్ద రహస్యమే దాగుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మూడు పత్రాల్లో ఒకదానికి ఖమ్మం జిల్లా పరిధిలోని ఒక బడా లావాదేవీతో అంతర్గత సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సదరు ఉన్నతాధికారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పనిచేసిన కాలంలోనే, ఖమ్మంకు చెందిన కొందరు బడా రాజకీయ నేతలు, రియల్టర్లు అక్కడ పెద్ద ఎత్తున భూదందాలు సాగించారు. దానికి ప్రతిఫలంగా ఖమ్మం వెలుగుమట్ల పరిధిలోని కొన్ని వివాదాస్పద భూముల్లో బినామీ పెట్టుబడులు చేతులు మారాయనే ఘాటున చర్చ సాగుతోంది. ఈడీ గనుక ఈ మనీ లాండరింగ్ మూలాలను గట్టిగా లాగితే ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు కూడా బోనులో నిలబడక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఆఫీసుల్లో కలవరం
హైదరాబాద్ వేదికగా ఈడీ తన పట్టును బిగించడంతో ఖమ్మంలోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ప్రైవేటు రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లోనూ గుసగుసలు మొదలయ్యాయి. వెలుగుమట్ల పరిధిలో గతంలో వివాదాస్పదంగా మారిన సర్వే నంబర్ల ఫైళ్లను, కోర్టు ఆదేశాల పేరిట ఇచ్చిన మ్యుటేషన్ల రికార్డులను కొందరు అధికారులు రహస్యంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈడీ దర్యాప్తు పరిధి కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాదని, ‘భూదాన్’ పేరుతో ఎక్కడెక్కడ మనీ లాండరింగ్ జరిగిందో వాటన్నింటినీ లాగుతామని స్పష్టం చేయడంతో వెలుగుమట్ల భూబకాసురుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరగబోతుందో, ఎందరి జాతకాలు బయటపడతాయోనని జిల్లా వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భూదాన్ భూముల పరిరక్షణ కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న హక్కుల సంఘాలు, బాధితులు ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడాన్ని స్వాగతిస్తున్నారు. మహేశ్వరం భూముల దర్యాప్తు వెలుగుమట్ల అక్రమాలను వెలికితీయడానికి ఒక తాళంచెవిలా మారుతుందని బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ కేసులో కేవలం అధికారులనే కాకుండా, వారి వెనుక ఉండి నడిపించిన అసలు సూత్రధారులను, రాజకీయ పెద్దలను టార్గెట్ చేస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. ఈ నెల 25న జరగబోయే విచారణ తర్వాత వెలువడే మరిన్ని నిజాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వర్గాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తాయో వేచి చూడాలి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





