హైద‌రాబాద్‌ను ప్ర‌పంచ న‌గ‌రంగా తీర్చిదిద్దుతాం

  • హైదరాబాదును ప్రపంచ నగరంగా తీర్చిదిద్దడానికి ఎన్ని నిధులైన వెచ్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు.
  • హెరిటేజ్ కట్టడాలను కాపాడుకుంటూ పాత నగరాన్ని బాగా అభివృద్ధి చేసుకుందాం
  • 19,579 కోట్ల రూపాయలతో మూడు ప్రాంతాలకు మెట్రో రైల్ విస్తరణకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం
  • హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో పదివేల కోట్ల రూపాయలు కేటాయించిన చరిత్ర ఏ ప్రభుత్వానికి లేదు
  • 7400 కోట్ల రూపాయలతో హైదరాబాద్ మహానగరానికి గోదావరి నది జలాలు తీసుకొస్తున్నాం
  • 2714 వందల కోట్ల రూపాయలతో ఎంజీబీఎస్ నుంచి చంద్రయాణ్ గుట్ట వరకు మెట్రో రైల్ విస్తరణ
  • 3840 కోట్ల రూపాయలతో హైదరాబాద్ మహానగరంలో 39 ఎస్టీపీలు నిర్మాణం చేస్తున్నాం
  • పాత నగరం అభివృద్ధి పురోగతిపై జరిగిన సమీక్ష సమావేశంలో వెల్లడించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
  • ఈ సమావేశానికి హాజరైన హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ నగరంగా తీర్చిదిద్దడానికి  ఎన్ని నిధులైన వెచ్చించడానికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో పాత నగరం అభివృద్ధి పురోగతి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహా మేరకు ఓల్డ్ సిటీ అభివృద్దిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నిర్వహించిన ఈ సమావేశానికి హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని శాసనసభ్యులు హాజరయ్యారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని చార్మినార్, మలక్ పేట్, కార్వాన్, యాకుత్ పురా, చంద్రయాణ్ గుట్ట, బహదూర్పుర, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పురోగతి పనులపై ఒక్కొక్కటిగా సమీక్షించారు. వాటి పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ హైదరాబాద్ పాత నగరంలో ఉన్న వారసత్వ నిర్మాణాలను కాపాడుకుంటూ పాత నగరాన్ని బాగా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి గత బడ్జెట్లో పది వేల కోట్ల రూపాయలు కేటాయించామని, ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన చరిత్ర ముందెన్నడు లేదన్నారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని ముందుకు వెళుతుందని అందులో భాగంగానే మూసి పునర్జీవం, మెట్రో రైల్ విస్తరణ, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధికి గత సంవత్సరం బడ్జెట్లో 10 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లుగానే, ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో నిధులు వెచ్చించి నగర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ మహానగర అభివృద్ధికి నిధులు ఖర్చు చేయలేదని, ఆ ఘనత మా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

నగర ప్రజల తాగునీటి కోసం 7400 కోట్ల రూపాయలతో గోదావరి నది జలాలు తీసుకొస్తున్నాం

హైదరాబాద్ నగరవాసులకు కృష్ణా, గోదావరి నది జలాల ద్వారా తాగునీరు అందించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని, గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పాలకులు అదనంగా ఒక్క ఎంఎల్డి నీటిని హైదరాబాదుకు తీసుకురాలేదన్నారు. రానున్న ఐదు సంవత్సరాలకు హైదరాబాదు నగర వాసులకు సరిపోను మంచినీటిని సరఫరా చేయడానికి 7400 కోట్ల రూపాయలతో గోదావరి ఫేజ్ 2, ఫేజ్ -3 ద్వారా  20 టీఎంసీల గోదావరి  నీళ్లను తీసుకురానున్నమని చెప్పారు.  ఇందులో ఐదు టీఎంసీలు మూసి పునర్జీ కోసం, 15 టిఎంసిలు హైదరాబాద్ నగర ప్రజల తాగు నీటికి వాడుతామని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో 2014 ముందు ఆనాటి ప్రభుత్వాలు 25 ఎస్టీపీలు నిర్మాణం చేయగా, 10 సంవత్సరాల కాలంలో గత పాలకులు కేవలం 20 ఎస్ టి పి ల నిర్మాణం చేపట్టారని, ప్రజా ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరంలోనే 3840 కోట్ల రూపాయలతో 39 ఎస్టిపిలను నిర్మాణం చేస్తున్నామని వెల్లడించారు. చంద్రయాణ్ గుట్ట నియోజకవర్గంలోని నిజాం కాలం నాటి 156 కిలోమీటర్ల పొడవున్న మురుగునీటి వ్యవస్థను పూర్తిగా 301 కోట్ల రూపాయలతో ఆధునికరిస్తున్న పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు.

నగరంలో మెట్రో రైల్ విస్తరణ

2714 వందల కోట్ల రూపాయలతో ఎంజీబీఎస్ నుంచి చంద్రయాణ్ గుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు. మెట్రో రైల్ ఏర్పాటు కోసం రోడ్డు విస్తరణ పనులు పాత నగరంలో శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 19,579 కోట్ల రూపాయలతో జేబీఎస్ నుంచి మేడ్చల్, జేబీఎస్ నుంచి షామీర్పేట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైల్ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు.

పాత నగరంలో ఇప్పటి వరకు 42  విద్యుత్తు సబ్ స్టేషన్ లు ఉండగా ఈ సంవత్సరం అదనంగా 18 సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదనంగా ఫీడర్స్ ను బిగించి ఓవర్ లోడ్ సమస్యను అధిగమించి  వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేశామని వెల్లడించారు. పాతబస్తీలో ఇప్పటి వరకు 25% అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ పూర్తయిందని మిగతా బ్యాలెన్స్ పనులకు ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్ మహానగరంలో ఇండ్లపై నుంచి ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్తు తీగలను సరి చేయాలని ఆదేశించారు. యాకుత్పురాలో 50 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి కావలసిన స్థలానికి తక్షణమే ఎన్వోసి ఇవ్వాలని జిహెచ్ఎంసి కమిషనర్ ను ఆదేశించారు. చార్మినార్ పాదాచారుల ప్రాజెక్టు దాదాపుగా పూర్తయిందని పెండింగ్లో ఉన్న చిన్న చిన్న పనులను త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెప్పారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు ను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులకు గుర్తు చేశారు. మీ అసెంబ్లీ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలేడ్జీ సెంటర్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలకు సూచించారు. పాతనగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అగ్ని ప్రమాదాలు పునారావృతం కాకుండా పకడ్బందీ చర్యలు

ఓల్డ్ సిటీ, గుల్జర్ హౌస్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగి ఇటీవల 17 మంది చనిపోవడం చాలా బాధాకరం. ఇది ప్రమాదమే అయినప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోకపోతే చరిత్ర క్షమించదని అన్నారు. హైదరాబాదులో అగ్నిప్రమాదాల నివారణకు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిటీ వేశారని, ఆ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం తీసుకొని చేపట్టే సంస్కరణలకు ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలన్నారు. అగ్నిప్రమాదాల నివారణకు ప్రభుత్వం చేపట్టే సంస్కరణలకు ప్రజల నుంచి కొత్త ఇబ్బంది వచ్చినా దార్శనీకతతో నాయకులు ప్రజలను ఒప్పించి అగ్ని ప్రమాద నివారణకు సంబంధించి తీసుకోవాల్సిన అన్ని చర్యలకు సహకరించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఎంఐఎం ఎమ్మెల్యేలు

పకడ్బందీగా రూపొందించుకున్న ప్రణాళికలతో వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఓల్డ్ సిటీని అభివృద్ధి చేస్తున్నందుకు ప్రజా ప్రభుత్వానికి హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఎంఐఎం ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు. 2700  కోట్ల రూపాయలతో ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణ్ గుట్ట వరకు మెట్రో రైల్ విస్తరణ, మెట్రో రైల్ కోసం శరవేగంగా జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు, 3840 కోట్ల రూపాయలతో మూసి పై నిర్మాణం చేస్తున్న ఎస్టీపీలు, 7400 కోట్ల రూపాయలతో హైదరాబాద్ నగరానికి గోదావరి నది జలాలు తీసుకొస్తున్నందుకు ప్రభుత్వాన్ని అభినందించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి బడ్జెట్లో 10 వేల కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ మజీద్ హుస్సేన్, కౌసర్ మోయినుద్దిన్, జుల్ఫకర్ అలీ, జాఫర్ హుస్సేన్, అహ్మద్ బిన్ అబ్దుల్లా భల్లాల, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు వికాస్ రాజ్, నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విద్యాశాఖ సెక్రెటరీ యోగితారాణా, ఎంఏయుడి సెక్రెటరీ ఇలంబర్తి, వాటర్ బోర్డు ఎండి అశోక్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ ఫారుఖీ, మైనార్టీ వెల్ఫేర్ సెక్రెటరీ యాస్మిన్ భాష తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page