- కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేరుస్తుంది..
- చాకలి ఐలమ్మ జయంతి సభలో మంత్రి పొన్నం
హైదరాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: కులగణనపై ఎలాంటి అనుమానాలు వొద్దని, కాంగ్రెస్ పార్టీ ఎవరికీ అన్యాయం చేయదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం , వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అండగా ఉంటుందని, బీసీ కమిషన్ గడువు ముగిసిన వారం రోజుల్లోపే కొత్త కమిషన్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. కులగణన పూర్తి చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. ఉద్యమాల నుంచి వొచ్చిన బిడ్డగా తాను బీసీలకు అన్యాయం జరగనివ్వనని అన్నారు. కొందరు కోఠీ మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలన శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా జరిగిందన్నారు. పదేండ్ల పాలన మేడి పండు చందంగా ఉందన్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే అందరూ ముందుకు సాగాలన్నారు. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కానీ నిధులు ఇవ్వలేదని తెలిపారు.. తెలంగాణ ఉద్యమ సమయంలో మన చరిత్ర బయటికి వొచ్చిందని అన్నారు. తాను ఒకసారి ఐలమ్మను చూసినట్టు చెప్పారు. మహిళా వర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టడమంటే మన ఆత్మగౌరవాన్ని గుర్తించడమని అన్నారు.
బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ.. బీసీ కమిషన్ తరపున సమగ్రంగా కులాల సమాచారం సేకరించబోతున్నామని అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఐలమ్మ మనుమరాలు శ్వేత మాట్లాడుతూ.. వీరనారి ఐలమ్మది పోరాటాల చరిత్ర అన్నారు. దొరతనానికి ధిక్కార స్వరం వినిపించిన బడుగుల గొంతుక అని అభివర్ణించారు. గత ప్రభుత్వం తమను ఆహ్వానించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమే గుర్తించిందని చెప్పారు. రజకులకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.