రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి మెట్రో రైల్

– ఎల్ అండ్ టీతో పూర్తయిన ఒప్పందం
– రూ.1,461.47 కోట్ల విలువైన వంద శాతం షేర్ల బదిలీ
– మెరుగ్గా మెట్రో విస్తరణ పనులు, ప్రణాళిక, సేవలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 26 : ఇప్పటివరకు ఎల్ అండ్ టీ అధీనంలో ఉన్న మెట్రో రైలును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1ను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఈమేరకు ఎల్ అండ్ టీతో కొద్ది రోజులుగా సంప్రదింపులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో హెచ్ఎంఆర్ఎల్ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, హెచ్ఎంఆర్ఎల్  ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ అండ్ టీ, ఎల్‌టీఎంఆర్‌హెచ్ఎల్ ప్రతినిధులు రాష్ట్ర సచివాలయంలో బుధవారం సమావేశమయ్యారు. సమావేశంలో ఎల్ అండ్ టీ, ఎల్ అండ్ టీ మెట్రో రైల్(హైదరాబాద్) లిమిటెడ్ సంస్థలతో షేర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌కు ఉన్న వంద శాతం షేర్లను రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఒప్పందంపై హెచ్‌ఎంఆర్ఎల్ తరఫున ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ అండ్ టీ లిమిటెడ్ తరఫున డి.కె.సేన్, ఎల్‌టీఎంఆర్‌హెచ్ఎల్ తరఫున కేవీబీ రెడ్డి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఎల్ అండ్ టీ హామీతో ఎల్‌టీఎంహెచ్ఆర్‌ఎల్‌పై ఉన్న రూ.13,538.53 కోట్ల అప్పును (2026 ఏప్రిల్ 30 నాటికి) ప్రభుత్వం హామీతో రీఫైనాన్స్ చేస్తారు. ఈ లావాదేవీకి ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా ఐడీబీఐ కేపిటల్ వ్యవహరించగా, లీగల్ అడ్వైజరీ సేవలను సరాఫ్ అండ్ పార్టనర్స్ సంస్థ అందించింది.

ప్రయాణికులకు అనుకూలంగా..
హైదరాబాద్‌లో ఎల్ అండ్ టీ మెట్రో రైలు (హైదరాబాద్) లిమిటెడ్ సంస్థ 2017 నవంబర్ నుంచి మూడు కారిడార్లలో మొత్తం 69 కిలోమీటర్ల నెట్‌వర్క్‌తో హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1ను నిర్వహిస్తోంది. మెట్రోలో ప్రస్తుతం రోజుకు సుమారు 4.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు సుమారు 86 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ఫేజ్-1, ప్రతిపాదిత ఫేజ్-2 నెట్‌వర్క్ రూపకల్పన, పనులు, ప్రణాళిక, అమలు, సేవల అందజేతలో సమన్వయం సాధ్యమవుతుంది. భవిష్యత్తులోనూ హైదరాబాద్ నగరానికి మరింత సమగ్ర, ఆధారపడదగిన, ప్రయాణికులకు అనుకూలమైన మెట్రో రైలు నెట్‌వర్క్ ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ముఖ్యమంత్రితో ఎల్ అండ్ టీ ఛైర్మన్ భేటీ
ఎల్ అండ్ టీ నుంచి మెట్రో రైలును స్వాధీనం చేసుకునే ఒప్పందానికి ముందుగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఎల్ అండ్ టీ చైౖర్మన్, ఎండీ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *