– ప్రధాని మోదీకి జుకర్ బర్గ్ క్షమాపణలు
– కంటెంట్‌ల బూస్ట్‌కు డబ్బులు తీసుకున్నట్లు అంగీకారం
న్యూదిల్లీ, ఆగస్ట్ 5: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియో తొలగింపుపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్.. ప్రధాని మోదీకి బహిరంగ క్షమాపణలు చెప్పారు. సీఎస్‌ఏఎమ్, డీప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై విచారం వ్యక్తం చేసిన మెటా.. కొన్ని రకాల కంటెంట్‌ను బూస్ట్ చేయడానికి భారీగా డబ్బులు తీసుకున్నట్టు అంగీకరించింది. అంతేకాక తమ ప్లాట్‌ఫామ్ నిర్వహణలో జరిగిన పొరపాట్లను కూడా అంగీకరించింది. ప్రధాని మోదీకి సంబంధించిన జులై 23 నాటి వీడియోను తొలగించడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మెటాను పార్లమెంటరీ కమిటీ బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవడం సహా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మూడు రోజుల అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు దిగొచ్చిన మెటా.. మోదీకి క్షమాపణలు చెప్పింది. ప్రధాని మోదీ ఫేస్‌బుక్ పోస్టు తాత్కాలికంగా తొలగించిన వ్యవహారం మెటాకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేయడంతో మెటా గ్లోబల్ బృందం బుధవారం కేంద్ర ఎలక్టాన్రిక్స్, సమాచార సాంకేతిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైంది. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మెటా గ్లోబల్ వ్యవహారాల అధికారి జోయెల్ కాప్లన్ నేతృత్వంలోని బృందం ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్‌తో సమావేశమైంది. అలాగే కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా మెటా బృందం కలిసింది. జూలై 23న ప్రధాని నరేంద్ర మోదీ యువతను ఉద్దేశించి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన వీడియోను ఫేస్‌బుక్ కొంతసేపు పరిమితం చేసింది. అనంతరం అది సాంకేతిక లోపం వల్ల జరిగిందని మెటా వివరణ ఇచ్చి పోస్టును పునరుద్ధరించింది. అయితే ఈ వివరణ సరిపోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సమావేశంలో ప్రధాని పోస్టు వ్యవహారంతోపాటు ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లలపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్, ప్రకటనలు, కృత్రిమ మేధతో రూపొందించిన తప్పుడు సమాచార నియంత్రణ వంటి అంశాలపై కూడా ప్రశ్నలు సంధించింది. ప్రముఖ వ్యక్తుల ధృవీకరించిన ఖాతాల్లోని పోస్టులను తొలగించే ముందు మరింత భద్రతా వ్యవస్థ ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. మెటా అల్గోరిథమ్ ఎలా పనిచేస్తోంది? పోస్టులు ఏ ప్రాతిపదికన తొలగించబడుతున్నాయి? భారత చట్టాలకు అనుగుణంగా వ్యవస్థ ఎలా పనిచేస్తుంది వంటి అంశాలపై కూడా ప్రభుత్వం వివరణ కోరింది. దేశ భద్రత, ప్రజా శాంతి వంటి అంశాలకు సంబంధించిన విషయాల్లో సోషల్ మీడియా వేదికలు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేసింది. సోషల్ డియా సంస్థలు భారత చట్టాలను పూర్తిగా పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంతోపాటు, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా మెటా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించినట్లు సమాచారం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




