– లబ్దిదారులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలి
– రాష్ట్రంలో 2,21,500 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు పూర్తి
– 4 కార్పొరేషన్లలో హైదరాబాద్ తరహా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం
– రెవెన్యూ, హౌసింగ్, శాఖ మంత్రి పొంగులేటి
మేడ్చల్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంతవరకు 2,21,500 ఇళ్లలో గృహ ప్రవేశాలు పూర్తయ్యాయని, ఈ దీపావళి పండుగ రోజున ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు జరపాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆరోజున పేదల ఇంట్లో వెలిగే ప్రతి దీపం ప్రజాప్రభుత్వ సంకల్పానికి ప్రతీక కావాలన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఎన్ని ఆర్ధిక అవరోధాలున్నా పేదల ఆత్మగౌరవానికి చిహ్నమైన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ఈ ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. భద్రత, భరోసాతోపాటు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్న సంకల్పంతో తొలి విడత 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటికి 2,21,500 ఇళ్లలో గృహ ప్రవేశాలు పూర్తయ్యాయని, మరో 1.90 లక్షల ఇళ్ళు వివిధ నిర్మాణ దశల్లో పూర్తికావస్తున్నాయని ఆయన తెలిపారు. గృహ ప్రవేశాలు జరుపుకున్న ఇళ్లకు దీపావళి రోజున ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇందిరమ్మ ఇళ్ళ కమిటీ సభ్యులు, ఈ పధకంతో మమేకమైన అందరూ వెళ్లి వారి ఆనందాల్లో భాగస్వాములు కావాలని పొంగులేటి కోరారు. దీనికి సూచికగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు అనే పోస్టర్‌ను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తొలి విడతగా 4.50 లక్షల ఇళ్లు, రెండో విడత 2.50 లక్షల ఇళ్లతోపాటు హైదరాబాద్ క్యూర్ ఏరియా పరిధిలో లక్ష ఇళ్లను మంజూరు చేశామని చెబుతూ హైదరాబాద్ తరహాలోనే నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ కార్పొరేషన్లలో కూడా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. జి+5 పద్దతిలో నిర్మించనున్న ఈ టవర్స్ నిర్మాణానికి సంబంధించి దీపావళిలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న టవర్స్ నుంచి వచ్చే ఏడాది బోనాలు ఎత్తిస్తామని మంత్రి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో రూ.40 వేల కోట్లతో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఎట్టిపరిస్ధితుల్లోనూ ఆపేది లేదని స్పష్టం చేస్తూ ఇప్పటికే ఇళ్ల లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు ప్రతి సోమవారం నేరుగా హైదరాబాద్ నుంచి అవినీతి రహితంగా నిధులను జమ చేస్తున్నామని వివరించారు. నగరాలు, పట్టణాలు, గ్రామాలేగాక మారుమూల ప్రాంతాలు, తండాలలో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, ఫలితంగా పేదవారి సొంతింటికల సాకారమవుతోందని మంత్రి పొంగులేటి అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





