– సర్కారు నిర్లక్ష్యమే శంకర్ గౌడ్‌ను బలితీసుకుంది
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసి డ్రైవర్ శంకర్ గౌడ్‌ది ఆత్మహత్య కాదు.. అది ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రెండున్నరేళ్లుగా సీఎం రేవంత్ ఆర్టీసి కార్మికులకు చేస్తున్న తీరని ద్రోహాన్ని తట్టుకోలేకే శంకర్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డారన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు, తోటి కార్మికుల హక్కుల సాధనకు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ శంకర్ గౌడ్ పార్థివదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులర్పించేందుకు కూడా అనుమతించకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. పుట్టెడు దుఖంలో ఉన్న శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు అండగా నిలిచిన బీఆరఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితోపాటు, బీఆరఎస్ నేతలు, ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలను నర్సంపేటలో అరెస్టు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అక్రమంగా అరెస్టు చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారు రాక్షసత్వం వల్ల కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అలాగే శంకర్ గౌడ్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అన్నివిధాలా ఆదుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా కనీసం సోయి లేని సర్కారు అంతులేని నిర్లక్ష్యం వల్లే ఇవాళ ఉద్యమం నాటి దృశ్యాలు, ఆత్మబలిదానాలు చోటుచేసుకునే పరిస్థితులు చూస్తున్నామని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల వేళ సవాలక్ష హామీలిచ్చిన రేవంత్ రెడ్డి కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతోనే ఆర్టీసీ కార్మిక లోకం ఇవాళ తీవ్ర నిరాశానిస్ప్నహల్లో కొట్టుమిట్టాడుతోందని ఆయన అన్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్రలను ఇకనైనా మానుకుని కార్మికులతో చర్చలు జరిపి, ఇచ్చిన హామీలను, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఒకేరోజు ముగ్గురు ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యా యత్నాలు చేసిన సంఘటన తెలంగాణ చరిత్రలో ఓ చీకటి రోజుగా మిగిలి పోతుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ సర్కారులో కనీసం చలనం లేకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఆర్టీసీ కార్మిక సోదరుల్లారా.. దయచేసి మనోధైర్యాన్ని కోల్పోకండి. పోరాటాలకు బీఆరఎస్ పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. ఈ నిరంకుశ కాంగ్రెస్ సర్కారు, ఈ అసమర్థ ముఖ్యమంత్రి మెడలు వంచి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన హక్కులను సాధించే వరకూ మనమంతా సంఘటితంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




