మంత్రివర్గం నుంచి సురేఖ బర్త్ రఫ్

-‌‌‌‌ పంతం నెగ్గించుకున్న రేవంత్
– అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి మరీ అనుకున్నది సాధించిన వైనం
– రాజీనామా చేయనని సురేఖ భీష్మించినా ఫలితం లేదు
– పార్టీలో తనమాటే ఫైనల్ అని నిరూపించిన సీఎం
– పనిలో పనిగా చిన్నారెడ్డికి కూడా ఉద్వాసన
– మరో ముగ్గురు బీసీ మహిళలతో సురేఖ లోటు భర్తీ
– కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేసిన సురేఖ
– ఇతర పార్టీల నుంచి వస్తున్న ఆహ్వానాలు
– అవినీతి ఆరోపణలు లేకపోవడమే కారణం
‌‌
హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 3: కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని వారాలుగా నలుగుతున్న తీవ్ర రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లాను సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం స్వయంగా కలిసి బర్తరఫ్ ఫైలును అందజేయగా, గవర్నర్ దానికి తక్షణమే ఆమోదం ముద్ర వేశారు. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ ప్రక్రియ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సాగింది. గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ తదితరులు లోక్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు సిద్ధం చేసిన కొండా సురేఖ బర్తరఫ్ ఫైల్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే గవర్నర్ సంతకం చేశారు. అనంతరం ఆమెను క్యాబినెట్ నుండి తొలగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఏడాది ఆగస్టులో కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ ఒక బహిరంగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం కుటుంబ వ్యాపార లావాదేవీలపై ఆరోపణలు చేయడంతో పాటు పరకాల నియోజకవర్గం నుండి తానే పోటీ చేస్తానని సుస్మిత ప్రకటించడం పార్టీలో తీవ్ర దుమారం రేపింది.కూతురి వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ బహిరంగంగా ఖండించకపోగా, అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలంటూ సమర్థించుకోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ  క్రమశిక్షణా సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా అధిష్ఠానం ఈ కఠిన చర్య తీసుకుంది.

పంతం నెగ్గించుకున్న రేవంత్

రాష్ట్ర‌ రాజకీయాల్లో సీనియర్ నేత, బీసీ మహిళా మంత్రి అయిన సురేఖను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయించడం ద్వారా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి తన రాజకీయ పంతాన్ని, పట్టును పూర్తిగా నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ల నుంచి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, తన నాయకత్వానికి సవాల్ విసిరిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాననే సంకేతాన్ని ఈ చర్య ద్వారా ఆయన స్పష్టం చేశారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తాను బాధ్యురాలిని కానని, మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కొండా సురేఖ అధిష్ఠానం ఎదుట భీష్మించుకు కూర్చున్నారు. అయితే, ఆమె మొండికేసినా వెనక్కి తగ్గని రేవంత్ రెడ్డి, ఏకంగా బర్తరఫ్  అస్త్రాన్ని ప్రయోగించి ఆమెను క్యాబినెట్ నుండి ఉద్వాసన పలికేలా చేశారు.   కొండా సురేఖ ఢిల్లీ వెళ్ళి పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీలకు ఇమెయిల్‌లు, వినతిపత్రాలు ఇచ్చి తన పదవిని కాపాడుకునేందుకు చివరి నిమిషం వరకు గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ వంటి అగ్రనేతలతో వ్యూహాత్మకంగా చర్చలు జరిపి, పార్టీ క్రమశిక్షణా సంఘం  నుండి నివేదిక తెప్పించి, హైకమాండ్ నుండి బర్తరఫ్‌కు గ్రీన్ సిగ్నల్ సాధించగలిగారు. కొండా సురేఖ ఆరోపించినట్లుగా—’తాను తొలగించకపోతే పదవిలో ఉండననే’ స్థాయి రాజకీయ ఒత్తిడిని తెచ్చి రేవంత్ తన పంతాన్ని సాధించుకున్నారు. కొండా సురేఖను తొలగిస్తే వరంగల్ జిల్లాలో బీసీ సామాజికవర్గం నుండి వ్యతిరేకత వస్తుందనే అంచనాలకు రేవంత్ రెడ్డి ముందే చెక్ పెట్టారు. సురేఖను తొలగించిన రోజే, వరంగల్ జిల్లా నుంచే మరో బీసీ మహిళా నేత గుండు సుధారాణిని కుడా చైర్‌పర్సన్‌గా నియమించడంతో పాటు, గద్వాల్ విజయలక్ష్మిని ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్‌గా, నేరెళ్ల శారదను మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించి మహిళా, బీసీ ఓటు బ్యాంక్ చెదిరిపోకుండా జాగ్రత్తపడ్డారు.  తద్వారా సామాజిక సమీకరణాల నెపంతో తనపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలకు రేవంత్ గండికొట్టారు.  ఈ బర్తరఫ్ ఎపిసోడ్‌తో పాటు, పార్టీ లైన్ దాటిన మరో సీనియర్ నేత చిన్నా రెడ్డిని కూడా తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ పదవి నుంచి రేవంత్ రెడ్డి తక్షణమే తొలగించారు. దీని ద్వారా ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ సీఎం మాటే ఫైనల్ అనే స్పష్టమైన సందేశాన్ని సొంత పార్టీ నేతలకు పంపారు.

తీవ్రంగా స్పందించిన సురేఖ‌

మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదనను వెళ్లగక్కారు. కనీసం తన వివరణ తీసుకోకుండా, ఒక్క మాట కూడా చెప్పకుండా నేరుగా బర్తరఫ్ చేయడం కక్షసాధింపు చర్యేనని ఆరోపించారు.”నా కుమార్తె వయోజనురాలు. ఆమె చేసిన వ్యాఖ్యలకు నన్ను ఎలా బాధ్యురాలిని చేస్తారు?” అని సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోయినా కుట్రపూరితంగానే తనను పదవి నుంచి తొలగించారని మండిపడ్డారు. మంత్రి పదవి పోయినప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీని వీడబోనని, ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు. ఒక బీసీ మహిళా మంత్రిని ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించడం దారుణమంటూ ప్రతిపక్షాలు కూడా ఈ పరిణామంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

బీజేపీ, ప్రజాశాంతి పార్టీ ఆహ్వానం

సురేఖపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు కాబట్టి ఆమె ఒకవేళ వస్తే బీజేపీలోకి స్వాగతిస్తామని ఎంపీ ధర్మపురి అరవింద్, ఇతర నేతలు వ్యాఖ్యానించారు. దీంతో కొండా దంపతులు ‘ప్లాన్-బి’ లో భాగంగా బీజేపీ వైపు చూస్తున్నారనే పుకార్లు షురూ అయ్యాయి. ఈ ఊహాగానాలపై  సురేఖ స్పందిస్తూ తాను బీజేపీలో చేరడం లేదని, భవిష్యత్తు కార్యాచరణపై కాంగ్రెస్ హైకమాండ్‌కు లేఖ రాశానని తెలిపారు. ఈ పరిణామాల మధ్య ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఆమెను తమ పార్టీలోకి రావాలంటూ బహిరంగంగా ఆహ్వానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *